డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికా పర్యటనకి టీమిండియా... సఫారీ టూర్‌లో మూడు మ్యాచుల టీ20, వన్డే సిరీస్‌లు, రెండు టెస్టులు ఆడనున్న భారత జట్టు.. 

ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు, మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలు ఆడే భారత జట్టు.. డిసెంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లనుంది..

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచుల టీ20, వన్డే సిరీస్‌లు ఆడే టీమిండియా, రెండు టెస్టులు ఆడుతుంది. 2021-22 సీజన్‌లో ఫ్రీడమ్ సిరీస్‌లో మూడు టెస్టులు జరిగాయి. అయితే ఈ సారి బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని, ఓ టెస్టు తగ్గించి, రెండు టెస్టులు మాత్రమే జరగబోతున్నాయి...

‘ఫ్రీడమ్ సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది. రెండు అద్భుతమైన టెస్టు జట్ల మధ్య పోటీ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్న మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి ఇద్దరు గొప్ప నాయకుల పేరుతో రూపొందించిన ఈ సిరీస్‌‌తో గౌరవించడం గర్వకారణం. 

Scroll to load tweet…

బాక్సింగ్ డే టెస్టు, న్యూయర్ టెస్టు రెండూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత కీలకమైనవి. అందుకే ప్రత్యేకంగా టీ20, వన్డే సిరీస్‌లు ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాం...’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

‘భారత జట్టు రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇరు జట్లకి ఇది అత్యంత కీలకమైన సిరీస్. మూడు ఫార్మాట్లలో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇరు జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచులు జరుగుతాయని ఆశిస్తున్నాం. సౌతాఫ్రికా దేశ వ్యాప్తంగా మ్యాచులు నిర్వహించబోతున్నాం. బీసీసీఐ సహకారానికి ధన్యవాదాలు..’ అంటూ తెలిపాడు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ లాసన్ నైడూ...

డిసెంబర్ 10న డర్భన్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా, డిసెంబర్ 12న గెబర్హాలో రెండో టీ20, జోహన్‌బర్గ్‌లో డిసెంబర్ 14న మూడో టీ20 మ్యాచులు ఆడుతుంది. అక్కడే డిసెంబర్ 17న మొదటి వన్డే ఆడే ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, డిసెంబర్ 19న గెబర్హాలో రెండో వన్డే, డిసెంబర్ 21న పర్ల్‌లో మూడో వన్డే ఆడతాయి...

డిసెంబర్ 26న (బాక్సింగ్ డే టెస్టు) సెంచూరియన్‌లో తొలి టెస్టు ఆడే ఇండియా, సౌతాఫ్రికా.. జనవరి 3న కేప్‌టౌన్‌లో రెండో టెస్టు ఆడుతుంది. 2021-22 సౌతాఫ్రికా టూర్‌ టీమిండియాలో సంచలన మార్పులు తీసుకొచ్చింది. ఈ టూర్‌లో వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ, కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ, టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. అయితే రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో 2022 ఏడాదిలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది టీమిండియా..