వనమంతా గులాబీ మయం! భారత టెస్టు క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది. ఐదు రోజుల ఆటకు కొత్త జీవం తీసుకొచ్చేందుకు తొలి ప్రయత్నంగా టీమ్‌ ఇండియా నేడు తొలి గులాబీ టెస్టుకు సై అంటోంది. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో గులాబీ పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... చారిత్రక ఘట్టానికి ఏర్పాట్లు చేయటంలో బీసీసీఐ, క్యాబ్‌ బిజీ బిజీగా ఉన్నాయి!.

ఆటలో బంతి మారినా, టీమ్‌ ఇండియా బలంలో ఎటువంటి మార్పు లేదు. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌ను ఇరగదీసిన కోహ్లిసేన ఈడెన్‌లోనూ అదరగొట్టాలని చూస్తుంది. పేసర్లకు గులాబీ బంతితో రెట్టింపు ప్రయోజనం దక్కనుండటం బంగ్లాదేశ్‌కు ప్రాణ సంకటంగా మారింది. కోల్‌కతలో భారత పేస్‌ ధాటికి ఎదురొడ్డి బంగ్లా పులులు ఏ మేరకు నిలుస్తాయో చూడాలి.

టెస్టు క్రికెట్‌లో భారత్‌ నూతన ఒరవడిని అందుకునేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ముస్తాబైంది. డే నైట్‌ టెస్టు కోసం కోల్‌కత నగరం గులాబీ శోభను సంతరించుకుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, కూడళ్లు ఇప్పటికే గులాబీ రంగులో మెరుస్తున్నాయి. మరోవైపు మైదానంలో గులాబీ బంతి సవాల్‌ను స్వీకరించేందుకు కోహ్లిసేన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది.

Also read: భారత్ తొలి డే నైట్ టెస్ట్: పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు...

తొలి టెస్టును మూడు రోజుల్లోపే నెగ్గి 60 పాయింట్లు సొంతం చేసుకున్న భారత్‌.. కోల్‌కతలోనూ మరో 60 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లపై కన్నేసింది. ఐదు రోజుల ఆటలో అసలు పోటీ ఇవ్వలేని బంగ్లాదేశ్‌, నేడు గులాబీ టెస్టులో రాణించటంపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అన్ని రంగాల్లో తిరుగులేని జోరుతో ఉన్న టీమ్‌ ఇండియా నేడు గులాబీ టెస్టుకు హాట్‌ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

భారత్ ను ఆపతరుమా...

ఇండోర్‌ టెస్టులో భారత్‌ అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ప్రదర్శన చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ద్విశతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. పుజార మెరుపు వేగంతో అర్ధ సెంచరీ అందుకున్నాడు. రవీంద్ర జడేజా, రహానె రాణించారు. అంతా బాగానే ఉంది. కానీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సున్నా పరుగులకే వికెట్‌ కోల్పోయి నిరాశపరిచాడు. 

చారిత్రక టెస్టులో విరాట్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. ఇండోర్‌ ప్రదర్శనతో కలిపి కోహ్లి కోల్‌కతలోనే కొట్టేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి కెప్టెన్‌ కోహ్లి ఏం చేస్తాడో ఆసక్తికరంగా మారింది.  

బౌలింగ్‌ విభాగంలో సీమర్లు జోరు మీదున్నారు. ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌లు పింక్‌ బాల్‌తో రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎరుపు బంతితోనే చెలరేగుతున్న పేసర్లు, పూర్తిగా సీమర్లకు సహకరించే గులాబీ బంతితో దుమ్మురేపాలని భావిస్తున్నారు. పిచ్‌ నుంచి, బంతి నుంచీ స్పిన్‌కు ఎటువంటి సహకారం లభించకపోయినా, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు తుది జట్టులో చోటు నిలుపుకునే అవకాశం మెండుగా ఉంది. కుల్దీప్ యాదవ్ ను కూడా కొట్టిపారేయలేము. 

బంగ్లా కనీసం పోటీ అయినా ఇవ్వగలదా...?

టీ20 సిరీస్‌లో బలమైన పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్‌, తొలి టెస్టులో తేలిపోయింది. భారత్‌ భారీ విజయంతో ఇరు జట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపింది. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌ ఓపెనర్లు ఇస్లాం, ఇమ్రుల్‌లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. కీలక బ్యాట్స్‌మెన్‌ సైతం పేస్‌కు దాసోహం అయ్యారు. షమి, ఉమేశ్‌ ల నిప్పులు చెరిగే బంతులకు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తిపోయారు. 

Also read: గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

ఇప్పుడు కోల్‌కతలో బంగ్లాదేశ్‌ ముందున్న అతి పెద్ద సవాలు  భారత పేసర్లను ఎదుర్కొవటమే. తొలి సెషన్‌లోనైనా భారత పేసర్లను కాచుకుని బంగ్లా బ్యాట్స్ మెన్  వికెట్లు నిలుపుకోగలరా అనేది చూడాలి. మహ్మదుల్లా, ముష్ఫీకర్‌ రహీమ్‌, మహ్మద్‌ మిథున్‌, లిటన్‌ దాస్‌, మోమినుల్‌ హాక్‌ నుంచి బంగ్లా బాధ్యతాయుత ప్రదర్శన కోరుకుంటోంది. బౌలింగ్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ తుది జట్టులోకి రానున్నాడు. అతడికి అబు జయేద్‌, హుస్సేన్‌ల సహకారం ఎంతమేర లభిస్తుందో చూడాలి.

పిచ్ రిపోర్ట్... 

కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ సహజంగానే పేసర్లకు అనుకూలం. ఇప్పుడు గులాబీ బంతి కూడా తోడవటంతో పిచ్ సీమర్లకు స్వర్గధామం. గులాబీ బంతి కోసం మైదానంలో పచ్చికను 6 మిల్లీ మీటర్లలోపు ఉంచటం పేసర్ల వికెట్ల వేటకు మరింత తోడ్పాటు అందించనుంది. 

సంప్రదాయ టెస్టు వికెట్‌నే సిద్ధం చేశామని క్యూరేటర్‌ చెప్పాడు. రాత్రి వేళలో మంచు ప్రభావం దృష్టిలో ఉంచుకుని పిచ్‌ తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈడెన్‌లో స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చు. ఇరు జట్లూ నలుగురు సీమర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపవచ్చు.

ముఖ్య అతిథి బంగ్లా ప్రధాని షేక్ హసీనా

చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌ డే నైట్‌ పింక్ టెస్టుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేన్‌ హసీనా కోల్‌కత టెస్టు తొలి రోజు ఆటను వీక్షించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.  

భారత ప్రధాని నరెంద్ర మోడీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్‌ ప్రధాని కోల్‌కత టెస్టుకు రానున్నారు. బారత క్రీడా రంగంలో అరుదైన ఘట్టం డే నైట్‌ గులాబీ టెస్టును బంగ్లా ప్రధాని ప్రారంభిస్తారు. తొలి సెషన్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో గంటను మోగించి షేక్‌ హసినా ఆటను ప్రారంభిస్తారు. 

తుది జట్లు (అంచనా).... 

భారత్‌ : రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, వృద్దిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి.

బంగ్లాదేశ్‌ : షాద్మాన్‌ ఇస్లాం, ఇమ్రుల్‌ కయీస్‌, మోమినుల్‌ హాక్‌, ముష్ఫీకర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, మహ్మద్‌ మిథున్‌, లిటన్‌ దాస్‌, మెహిది హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, అబు జయేద్‌, ఎదాబత్‌ హుస్సేన్‌.