Asianet News TeluguAsianet News Telugu

లంకను గెలిచి, టైటిల్‌తో నిలిచి... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ కైవసం చేసుకున్న ఇండియా లెజెండ్స్‌...

వరుసగా రెండో సీజన్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచిన ఇండియా లెజెండ్స్... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్‌ సూపర్ సక్సెస్...

India Legends beats Sri Lanka Legends and wins Second Season Road safety World Series
Author
First Published Oct 2, 2022, 10:28 AM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను వరుసగా రెండో సీజన్‌లో కూడా కైవసం చేసుకుంది ఇండియా లెజెండ్స్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా సీజన్ 2ని ప్రారంభించిన ఇండియా లెజెండ్స్ జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ జట్టుపై 33 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుని... వరుసగా రెండో సీజన్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచింది...

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ను కులశేఖర గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సమయానికి 1 పరుగు మాత్రమే చేసిన ఇండియా లెజెండ్స్, సచిన్ వికెట్ కోల్పోయింది...

సురేష్ రైనా మొదటి బంతికి ఫోర్ బాది, రెండో బంతికి అవుట్ అయ్యాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇండియా లెజెండ్స్‌ని నమన్ ఓజా, వినయ్ కుమార్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 90 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన వినయ్ కుమార్, ఇషాన్ జయరత్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, కులశేఖర బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇర్ఫాన్ పఠాన్ 11 పరుగులు చేసి అవుట్ కాగా యూసఫ్ పఠాన్ డకౌట్ అయ్యాడు. స్టువర్ట్ బిన్నీ 2 బంతుల్లో 2 ఫోర్లు బాది 8 పరుగులు చేయగా ఓపెనర్‌గా వచ్చిన నమన్ ఓజా 71 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

196 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక లెజెండ్స్ జట్టు 18.5 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దిల్షాన్ మునువీర 8, సనత్ జయసూర్య 5, కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 11, ఉపుల్ తరంగ 10, అసేల గుణరత్నే 19, జీవన్ మెండిస్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు..

85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక లెజెండ్స్. అయితే ఈ దశలో ఇషాన్ జయరత్నే 22 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు, మహేళ ఉడవట్టే 19 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే మహేళ ఉడవట్టేను అవుట్ చేసిన అభిమన్యు మిథున్, ఆ తర్వాతి బంతికే ఇసురు ఉదనను క్లీన్ బౌల్డ్ చేశాడు...

ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ జయరత్నేను పెవిలియన్ చేర్చిన వినయ్ కుమార్, తర్వాతి బంతికి ధమ్మిక ప్రసాద్‌ని డకౌట్ చేయడంతో శ్రీలంక లెజెండ్స్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన సచిన్ టెండూల్కర్, రిటైర్మెంట్ తర్వాత వరుసగా రెండో టైటిల్ సాధించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios