ICC Under-19 World Cup 2022: గతంలో నాలుగు  జూనియర్ ప్రపంచకప్ లు గెలిచిన టీమిండియా ఇప్పుడు  ఐదో సారి విజేతగా నిలిచేందుకు రంగం  సిద్ధం చేసుకుంది. ఇంగ్లాండ్ తో  నేటి సాయంత్రం అంటిగ్వా  వేదికగా  తుది పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.  

అండర్-19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ కప్ లో యశ్ ధుల్ సారథ్యంలోని టీమిండియా.. టామ్ ప్రీస్ట్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ ఢీకొనబోతున్నాయి. భారత్ కు ఇది వరుసగా నాలుగో ఫైనల్ కాగా.. 1998 తర్వాత అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్ లోకి అడుగుపెట్టడం ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి. గతంలో భారత జట్టు నాలుగు సార్లు (మొత్తంగా ఎనిమిదో ఫైనల్) జూనియర్ ప్రపంచకప్ (2000, 2008, 2012, 2018) లలో గెలవగా.. ఇంగ్లాండ్ ఒకసారి (1998) లో విశ్వ విజేతలుగా నిలిచాయి. ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే.. దీంతో నేటి మ్యాచుపై ఇరు జట్ల అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

గతేడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భంగపడ్డ భారత్ ఈసారి మాత్రం విశ్వ కప్ ను వీడేది లేదన్న పట్టుదలతో ఆడుతున్నది. టోర్నీ ఆసాంతం ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నది. అండర్-19 ప్రపంచకప్ నకు కొద్దిరోజుల ముందు జరిగిన ఆసియాకప్ లో అదరగొట్టిన భారత కుర్రాళ్లు ఆ ప్రదర్శనకు కొనసాగింపుగా ప్రపంచకప్ లో కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. 

కరోనా ను దాటుకుని... 

ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం ఆధ్యంతం మలుపులే. తొలుత రెండు లీగ్ మ్యాచుల అనంతరం కెప్టెన్ యశ్ ధుల్ తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐర్లాండ్ తో భారత్ ఆడిన లీగ్ మ్యాచుకు మనకు తుది జట్టును సిద్ధం చేసుకోవడం కూడా కష్టంగా మారింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భారత కుర్రాళ్లు ధీటుగా నిలుచున్నారు. భారత మాజీ ఆల్ రౌండర్ హృషికేష్ కనిత్కర్ శిక్షణలో, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గనిర్దేశనంలో అద్భుతంగా రాణించారు. లీగ్ లు దాటి క్వార్టర్స్ చేరిన భారత జట్టు.. గత ఫైనల్లో బంగ్లా చేతిలో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది. ఇక సెమీస్ లో ఆస్ట్రేలియాపై కెప్టెన్,వైస్ కెప్టెన్ లు రాణించడంతో కంగారూలను వెనక్కి నెట్టి వరుసగా నాలుగో ఫైనల్ కు సిద్ధమైంది. 

ఇంగ్లాండ్ కూడా.. 

టామ్ ప్రీస్ట్ సారథ్యంలోని ఇంగ్లాండ్ కుర్రాళ్లు కూడా టోర్నీ ఫైనల్ కు రావడానికే చాలా అడ్డంకులనే అధిగమించారు. 1998 లో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత తిరిగి ఆ జట్టు ఫైనల్ కు చేరలేదు. కానీ ఈ సారి జూనియర్ ప్రపంచకప్ ను ముద్దాడాలనే లక్ష్యంతోనే టోర్నీలో అడుగిడింది ఇంగ్లాండ్. సెమీస్ లో ఆ జట్టు ఆఫ్ఘానిస్తాన్ తో సంచలన విజయం సాధించి ఫైనల్ కు దూసుకొచ్చింది. 

వీరి ఆట ముఖ్యం.. 

యశ్ ధుల్ తో పాటు ఓపెనర్లు హర్నూర్ సింగ్, రఘువంశీ, షేక్ రషీద్ లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మిడిలార్డర్ లో వచ్చే రాజ్ బవ, వికెట్ కీపర్ బన.. ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్.. నిశాంత్ సింధు, కౌశల్ తాంబే లతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ లో లెఫ్టార్మ్ సీమర్ రవికుమార్ తన స్వింగ్ తో అదరగొడుతున్నాడు. ఇక భారత బలమైన స్పిన్నర్లు విక్కీ ఓస్త్వాల్ (ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (12) తీసుకున్న జాబితాలో తొలిస్థానం), నిశాంత్ సింధు మెరుగైన ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్ కు కష్టమే. 

భారత్ దే ఆధిపత్యం.. 

ఇంగ్లాండ్ తో ఇప్పటివరకు భారత జట్టు 49 మ్యాచులు ఆడింది. ఇందులో 37 మ్యాచులలో భారత్ దే ఆధిక్యం. ఇక ఇంగ్లాండ్ 11 మ్యాచుల్లో నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయింది.

- అంటిగ్వా వేదికగా శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం) జరుగబోయే ఇండియా-ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.