Asianet News TeluguAsianet News Telugu

సంచలనాలేమీ లేవు.. భారత్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ బంగ్లా కైవసం

BANvsIND: భారత్-బంగ్లాదేశ్ మధ్య ముగిసిన మూడో వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది.  తొలి రెండు వన్డేలలో అత్యంత చెత్త ఆటతో  ఓడిన భారత జట్టు సిరీస్ కోల్పోయినా  చివరి వన్డేలో  రాణించింది. 

India Beat Bangladesh By 227 Runs in 3rd ODI,  Hosts Seal The Series
Author
First Published Dec 10, 2022, 6:44 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. న్యూజిలాండ్  తో వన్డే సిరీస్ ను కోల్పోయి బంగ్లాదేశ్ లో అడుగిడిన టీమిండియా.. తొలి రెండు వన్డేలు ఓడి ఆలస్యంగా పుంజుకుంది. ముందు బ్యాట్ తో దుమ్మురేపి ఆ తర్వాత బౌలింగ్ లో కూడా మెరుపులు మెరిపించి మూడో వన్డేను  సొంతం చేసుకుని పరువు దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) ల మెరుపులతో  నిర్ణీత 50 ఓవర్లలో 409 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 34 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 227 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇక మ్యాచ్ ఓడినా బంగ్లాదేశ్ 2-1 తేడాతో  వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఈనెల 14 నుంచి మొదలుకానుంది. 

భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా ఆడినట్టు కనిపించలేదు.  ఓపెనర్లు లిటన్ దాస్ (29), అనముల్ హక్ (8) లు ధాటిగా ఆడేందుకు యత్నించారు. శార్దూల్ వేసిన నాలుగో ఓవర్లో లిటన్ దాస్ 4, 6, 4  బాదాడు. కానీ అక్షర్ పటేల్ రాకతో  బంగ్లాకు కష్టాలు మొదలయ్యాయి. అక్షర్ వేసిన  ఐదో ఓవర్ తొలి బంతికి అనమోల్.. సిరాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

వన్ డౌన్ లో వచ్చిన షకిబ్ అల్ హసన్ (43) తో కలిసి లిటన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాలని చూశాడు.  కానీ సిరాజ్ వేసిన 8 వ ఓవర్ రెండో బంతికి సిరాజ్ శార్దూల్ కు క్యాచ్ ఇచ్చాడు. ముష్ఫీకర్ (7) కూడా  పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ యాసిర్ అలీ (25)తో కలిసి షకిబ్  కాసేపు భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు.  అయితే ఉమ్రాన్ మాలిక్ ఈ జోడీని విడదీశాడు.   ఉమ్రాన్ వేసిన 19.3 వ ఓవర్లో యాసిర్ ఎల్బీగా ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 22.6వ ఓవర్లో  షకిబ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహ్మదుల్లా (20) ను వాషింగ్టన్ సుందర్ ఎల్బీడబ్ల్యూ ద్వారా ఔట్ చేశాడు. 

అఫిఫ్ హోసేన్ (8), గత రెండు మ్యాచ్ లలో బంగ్లాను గెలిపించిన మెహిది హసన్ మిరాజ్ (3), ఎబాదత్ (0) ను  ఠాకూర్ పెవిలియన్ పంపాడు.  ఇక  ముస్తాఫిజుర్ (13) ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేయడంతో  బంగ్లా ఇన్నింగ్స్  ముగిసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కు మూడు వికెట్లు దక్కగా.. ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు తలా వికెట్ పడగొట్టి సమిష్టిగా రాణించారు. 

 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.  శిఖర్ ధావన్ (3) మరోసారి విఫలమైనా.. ఇషాన్ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) లు  ద్విశతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు ఏకంగా 290 పరుగులు జోడించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్.. 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో  37 రన్స్ చేసి భారత్ స్కోరును 400  దాటించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios