Asianet News TeluguAsianet News Telugu

IND vs WI: కటక్ లో అమీ తుమీ...ఐపీఎల్ వేలం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

IND vs WI: two teams eye a series victory in the final ODI at cuttack today
Author
Cuttack, First Published Dec 22, 2019, 11:04 AM IST

సొంతగడ్డపై టీమ్‌ ఇండియా వరుసగా రెండో సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌ ఆడబోతుంది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో చావోరేవో మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లిసేన.. నేడు కరీబియన్లతో అమీతుమీకి సిద్ధమైంది. 

ఫలితం కంగారూలతో మ్యాచ్‌కు భిన్నంగా ఉంటుందని భారత్‌ నమ్మకంగా ఉంది. భారత్‌కు వరుసగా పదో వన్డే సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడిన వెస్టిండీస్‌.. చివరగా టీమ్‌ ఇండియా సొంతగడ్డపై 2002లో వన్డే సిరీస్‌ సాధించింది. 

1-1తో సమవుజ్జీగా టైటిల్‌ రేసులో నిలిచిన వెస్టిండీస్‌ చరిత్ర తిరగరాసేందుకు ప్రయత్నిస్తోంది. బౌలర్లు సహకరిస్తే భారత్‌లో సుదీర్ఘ సిరీస్‌ నిరీక్షణకు తెరదించేందుకు పొలార్డ్‌ గ్యాంగ్‌ ఎదురుచూస్తోంది. కటక్‌లో భారత్‌, వెస్టిండీస్‌ మూడో వన్డే నేడు.

Also read: వెస్టిండీస్‌తో మూడో వన్డే: మరో రికార్డుపై కన్నేసిన కుల్‌దీప్‌

స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

మరోవైపు భారత గడ్డపై వన్డే సిరీస్‌ విజయం అందుకుని కరీబియన్‌ బృందానికి ఇంచుమించు అంతే కాలమైంది. వెస్టిండీస్‌పై వరుసగా పదో వన్డే సిరీస్‌ విజయం కోసం కోహ్లిసేన ఉత్సాహంగా అడుగులు వేస్తుండగా, చాన్నాండ్ల తర్వాత అందివచ్చిన సిరీస్‌ విజయావకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో విండీస్‌ నిమగమైంది. 

గతంలో కటక్‌లో జరిగిన వన్డేల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత్‌ 381/6 చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్‌ 366/8 భారీగానే స్కోరు చేసింది. భారత్‌, వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లు దూకుడుగా రాణిస్తున్నారు. దీంతో కటక్‌లో మళ్లీ భారీ స్కోర్ల థ్రిల్లర్‌ ఎదురుచూస్తోంది. మెరుగైన బౌలింగ్‌ బృందం సిరీస్‌ విజేతను నిర్ణయించగలదు.

జట్టు కూర్పు ఎలా ఉండనుంది...?

సిరీస్‌కు ముందు సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను కోల్పోయిన భారత్‌.. విశాఖ వన్డే తర్వాత దీపక్‌ చాహర్‌ సేవలను దూరం చేసుకుంది. షార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనిలు ఇప్పుడు జట్టుతో ఉన్నారు. కటక్‌ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలా? ముగ్గురు సీమర్లతో ఆడాలనే విషయంపై కోహ్లిసేన తర్జనభర్జన పడుతోంది. 

రంజీ ట్రోఫీలో స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేసిన నవదీప్‌ సైని జాతీయ జట్టు తరఫున సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. మణికట్టు స్పిన్‌ జోడీ కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌లు మ్యాజిక్‌ను కటక్‌లోనైనా కలిసికట్టుగా చూడాలనే అభిమానుల కోరిక తీరేలా కనిపించటం లేదు!. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ను బంతితో ఉపయోగించుకోవటంపై కోహ్లి దృష్టి సారిస్తే బౌలింగ్‌ విభాగంలో అవకాశాలు కాస్త మెరుగ్గానే ఉంటాయి. మహ్మద్‌ షమి బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు.

భారత బాటింగ్ దుర్భేధ్యం.... 

బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌ అత్యంత పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ విశాఖ వన్డేలో ఇరగదీశారు. శతకాలతో మెరిసి విండీస్‌ బౌలర్లను ఆడుకున్నారు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్‌ వరుసగా నాల్గో అర్ధ సెంచరీతో రాణించాడు. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశాఖలో నిరాశపరిచినా, కటక్‌లో కోహ్లి విన్యాసంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ధనాధన్‌లో టచ్‌లో కొనసాగుతుండగా.. కేదార్‌ జాదవ్‌ దూకుడు లయ కొనసాగించాడు. బ్యాటింగ్‌ విభాగంలో అందరూ జోరుమీద ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా కోహ్లిసేనకు బ్యాటింగ్‌ లైనప్‌తో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

సిరీస్‌పై విండీస్‌ కన్ను... 

దశాబ్దకాలంకు పైగా టీమ్‌ ఇండియా చేతిలో దారుణ పరాజయాలు, సిరీస్‌ ఓటములు చవిచూస్తోన్న వెస్టిండీస్‌కు ఊహించని రీతిలో సిరీస్‌ వేట అవకాశం లభించింది. స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా యువ ప్రతిభతో వెస్టిండీస్‌ కోహ్లిసేనకు గట్టి సవాల్‌ విసురుతోంది. 

కటక్‌లో నెగ్గి భారత్‌లో వన్డే సిరీస్‌ నిరీక్షణకు తెరదించాలని పొలార్డ్‌ భావిస్తున్నాడు. ఓపెనర్లు లూయిస్‌, హోప్ సహా షిమ్రోన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, కీరన్‌ పొలార్డ్‌ ఫామ్‌లో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్థులకు విండీస్‌ శిబిరంలో కొదువలేదు.

Also read: IPL 2020: ఆ జట్టు బలం అతనే.. అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం 

కానీ బౌలింగ్‌ విభాగంతోనే కరీబియన్‌ బృందం సమస్యలు ఎదుర్కొంటుంది. కొత్త బంతితో భారత ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు కూల్చలేకపోతున్నారు. ఆఖరు ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్నారు. అల్జారీ జొసెఫ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కీమో పాల్‌లకు తోడు హౌల్డర్‌ సీనియర్‌గా బాధ్యత తీసుకోవాలి. బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయగల్గితే కటక్‌లో వెస్టిండీస్‌ విజయాన్ని ఆశించవచ్చు.

ఇక పోతే ఐపీఎల్ వేలం తరువాత ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం ఒక ఆసక్తికర అంశం. విండీస్ ప్లేయర్లయినా హెట్ మేయర్, సెల్యూట్ స్టార్  షెల్డన్‌ కాట్రెల్‌ లను ఫ్రాంచైజీలు భారీ మొత్తాన్ని వెచ్చించి కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటగాళ్ల ఆటతీరు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

పిచ్‌, వాతావరణ పరిస్థితులు... 

కటక్‌లో చివరగా జరిగిన వన్డేలో పరుగుల వరద పారింది. 350 ప్లస్‌ స్కోర్లు నమోదయ్యాయి. నేడు వెస్టిండీస్‌తో వన్డేకు అటువంటి పిచ్‌నే సిద్ధం చేశారు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్‌ నెగ్గిన తొలుత బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడనుంది. కటక్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మ్యాచ్‌కు ఎటువంటి వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ చెబుతోంది. అనువైన వాతావరణంలో నేడు కటక్‌లో పరుగుల వాన కురువనుంది!.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

భారత్‌ :    రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, శివం దూబె, యుజ్వెంద్ర చాహల్‌, నవదీప్‌ సైని, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి.

వెస్టిండీస్‌ : హోప్, ఎవిన్‌ లూయిస్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హౌల్డర్‌, కీమో పాల్‌, హెడెన్‌ వాల్ష్‌, అల్జారీ జొసెఫ్‌, షెల్డన్‌ కాట్రెల్‌.

Follow Us:
Download App:
  • android
  • ios