India Vs West Indies ODI:  43 పరుగులకే  మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను  ఆదుకున్న కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్.. కానీ

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు స్కోరుబోర్డు పుంజుకుంటున్న తరుణంలో కెఎల్ రాహుల్ రనౌట్ టీమిండియాను మళ్లీ వెనక్కి నెట్టింది. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డ రాహుల్.. అనవసర పరుగు కోసం పరిగెత్తి రనౌట్ గా వెనుదిరిగాడు. ఈజీగా రెండు పరుగులు తీయాల్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా స్కోరుబోర్డు నెమ్మదిగా కదులుతున్నది. రోహిత్ శర్మ (5), రిషభ్ పంత్ (18), విరాట్ కోహ్లి (18) వెంటవెంటనే నిష్క్రమించారు. 11ఓవర్ల లోపే భారత్ 43 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రాహుల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చారు.

వరుస వికెట్లు తీసి జోరుమీదున్న విండీస్ బౌలర్లను ఈ జంట ధీటుగా ఎదుర్కుంది. రోచ్, జోసెఫ్, స్మిత్ లను ఎదుర్కున్న రాహుల్-యాదవ్ ల జోడీ భారత ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడింది. ఇద్దరూ కలిసి మంచి బంతులను గౌరవిస్తూనే.. గతి తప్పిన బంతులను శిక్షించారు. మధ్య మధ్యలో ఇద్దరూ చూడచక్కని షాట్లతో హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చారు. 

నాలుగో వికెట్ కు ఈ ఇద్దరూ కలిసి 91 పరుగులు జోడించారు. 30వ ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్ లో బంతిని స్క్వేర్ దిశగా ఆడాడు రాహుల్. అది ఈజీగా డబుల్ తీసేదే. మొదటి పరుగు పూర్తి చేసిన రాహుల్.. రెండో దాని కోసం యాదవ్ ను కూడా రమ్మని సైగ చేశాడు. దీంతో యాదవ్.. పరుగుతీశాడు. అయితే అటు వైపుగా మధ్యలోకి వచ్చిన రాహుల్.. అక్కడే ఆగి తిరిగి వెనక్కి తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాడు. 

Scroll to load tweet…

కానీ యాదవ్ అప్పటికే సగం క్రీజు దాటడాన్ని చూసిన రాహుల్.. మళ్లీ కీపర్ వైపే పరిగెత్తాడు. కానీ అప్పటికే అకేల్ హోసిన్ విసిరిన బంతి.. కీపర్ హోప్ చేతుల్లో పడటంతో అతడు బెయిల్స్ ను పడగొట్టాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో రాహుల్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. ఈ రనౌట్ లో సూర్యకుమార్ యాదవ్ తప్పేమీ లేకున్నా.. రాహుల్ నిష్క్రమించగానే యాదవ్ వైపు గా చూసి అసహనంగా పెవిలియన్ వైపునకు నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

ఇదిలాఉండగా.. రాహుల్ నిష్క్రమణ అనంతరం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యాదవ్ (64) కూడా కొద్దిసేపటికే పెవిలియన్ కు చేరాడు. స్పిన్నర్ అలెన్ బౌలింగ్ లో జోసెఫ్ కు క్యాచ్ ఇచ్చి యాదవ్ ఔటయ్యాడు.