India Vs West Indies: రెండో వన్డేలో భారత్ తడబాటు.. టాపార్డర్ విఫలం.. ఆదుకున్న రాహుల్, సూర్యకుమార్ యాదవ్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు భారత బ్యాటర్ల నిర్లక్ష్యపు ఆటతీరుతో ఈ మ్యాచులో టీమిండియా స్కోరు 250 కూడా దాటలేదు. 43 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లు ఆదుకోవడంతో భారత్.. విండీస్ ముందు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఈ మ్యాచులో గెలిచి సిరీస్ నిలబెట్టుకోవాలంటే విండీస్.. 238 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. అందరినీ ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు. అయితే భారత్ కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న హిట్ మ్యాన్.. ఈ మ్యాచులో 5 పరుగులే చేసి నిష్క్రమించాడు. రిషభ్ పంత్ (18) కూడా పెద్దగా రాణించలేదు. ఇక విరాట్ కోహ్లి (18).. తన నిర్లక్ష్యపు ఆటతీరును మరోసారి కొనసాగిస్తూ పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ 11.6 ఓవర్లలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ (49), సూర్యకుమార్ యాదవ్ (64) తో జతకలిశాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ.. ఇన్నింగ్స్ ను నిర్మించిన ఈ జంట... భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ 30 వ ఓవర్లో అనవసర పరుగు కోసం వెళ్లిన రాహుల్.. రనౌట్ అయ్యాడు. కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ చేసుకున్న యాదవ్ కూడా నిష్క్రమించాడు.
ఈ ఇద్దరూ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. 25 బంతుల్లో 23 పరుగులు చేశాడు. కానీ భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద హోసిన్ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ కు చేరాడు. ఇక 25 బంతుల్లో 29 పరుగులు చేసిన దీపక్ హుడా.. చివర్లో స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (8), మహ్మద్ సిరాజ్ (3) లు పెద్దగా ప్రభావం చూపలేదు. చాహల్ (11) నాటౌట్ గా ఉన్నాడు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో... 237 పరుగులు చేసింది.
విండీస్ బౌలర్లలో జోసెఫ్, ఓడెన్ స్మిత్ లు చెరో రెండో వికెట్లు తీసుకోగా.. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, హోసిన్, అలెన్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.
