India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రెండో మ్యాచులో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా...
పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత జట్టుకు సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ.. తన తొలి సిరీస్ లోనే అదరహో అనిపించాడు. ఇప్పటికే గతేడాది ముగిసిన టీ20 సిరీస్ నెగ్గిన అతడు.. తాజాగా తొలి వన్డే సిరీస్ ను కూడా సాధించాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విండీస్ జట్టు.. అష్టకష్టాలు పడింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు... 46 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్.. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు. 2006 నుంచి వెస్టిండీస్ తో సిరీస్ కోల్పోని రికార్డును రోహిత్ సేన నిలబెట్టుకుంది. విండీస్ పై భారత్ కు ఇది వరుసగా 11వ వన్డే సిరీస్ విజయం..
238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు శుభారంభమే దక్కింది. వికెట్ కీపర్ షే హోప్ (27), బ్రాండన్ కింగ్ (18) లు తొలి వికెట్ కు 32 పరుగులు జోడించారు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి జోరుమీద కనిపించిన బ్రాండన్ ను.. ఏడో ఓవర్లో ప్రసిద్ధ్ వెనక్కిపంపాడు.
బ్రాండన్ ను పెవిలియన్ కు పంపిన ప్రసిద్ధ్.. ఆ తర్వాత ఓవర్లోనే బ్రావో (1) ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హోప్ ను చాహల్ ఔట్ చేశాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (9) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో విండీస్ 76 పరుగులకే 5వికెట్లు కోల్పోయింది.
కాగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి ప్రమాదకరంగా పరిణమిస్తున్న బ్రూక్స్ (44) ను దీపక్ హుడా పెవిలియన్ కు పంపాడు. జేసన్ హోల్డర్ (2) ను ఠాకూర్ ఔట్ చేశాడు. విండీస్ క్రమంగా వికెట్లు కోల్పోతున్నా అకీల్ హొసిన్ (34) మాత్రం పట్టుదలగా ఆడాడు. కానీ ఠాకూర్ వేసిన 39.2 వ ఓవర్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోయరార్డర్ తో కలిసి స్మిత్ (24) కాసేపు ప్రతిఘటించినా అతడి పోరాటం విండీస్ విజయానికి సరిపోలేదు. 45 వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని స్మిత్ గాల్లోకి లేపగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అందుకున్నాడు.
టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (9-3-12-4) నిప్పులు చెరిగాడు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరి విండీస్ ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్, దీపక్ హుడా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లకు తలో వికెట్ దక్కింది. తాజా విజయంతో వన్డే సిరీస్ ను గెలుచుకోవడమే గాక సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న హిట్ మ్యాన్.. ఈ మ్యాచులో 5 పరుగులే చేసి నిష్క్రమించాడు. రిషభ్ పంత్ (18) కూడా పెద్దగా రాణించలేదు. ఇక విరాట్ కోహ్లి (18).. తన నిర్లక్ష్యపు ఆటతీరును మరోసారి కొనసాగిస్తూ పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ (49), సూర్యకుమార్ యాదవ్ (64) తో జతకలిశాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.
