టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్న యశస్వి జైస్వాల్... ఇషాన్ కిషన్ టెస్టు ఎంట్రీ, శ్రీకర్ భరత్‌కి షాక్..
IND vs WI 1st Test: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన విండీస్ జట్టు కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన యంగ్ సంచలనం యశస్వి జైశ్వాల్, నేటి టెస్టు ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు.
అలాగే యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా నేటి మ్యాచ్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆడిన తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్.. నేటి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకున్న భారత క్రికెట్ జట్టు.. గ్యాప్ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేక, క్వాలిఫైయర్స్‌లో కూడా చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌కి ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో ఇది టీమిండియాకి, వెస్టిండీస్‌కి మొదటి మ్యాచ్ కూడా. నేటి మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ తరుపున అలిక్ అథనజ్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జయ్‌దేవ్ ఉనద్కట్‌కి తుది జట్టులో చోటు దక్కింది. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో జయ్‌దేవ్ ఉనద్కట్ ఫాస్ట్ బౌలర్లుగా టీమ్‌లో చోటు దక్కించుకోగా అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే 700 అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేసుకుంటాడు.
ఐదేళ్లుగా విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ సిరీస్‌లో ఆ లోటును తీర్చుకోవాలని చూస్తున్నాడు. జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ గాయపడడంతో పాటు మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్... పేస్ త్రయానికి సారథ్యం వహించబోతున్నాడు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో జట్టులోకి వచ్చిన శ్రీకర్ భరత్, మొదటి 5 మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. దీంతో ఇషాన్ కిషన్, నేటి మ్యాచ్‌లో బాగా ఆడితే.. రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చేవరకూ అతనే వికెట్ కీపర్‌గా కొనసాగొచ్చు..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ జట్టు: క్రెగ్ బ్రాత్‌వైట్, టగెనరైన్ చంద్రపాల్, రోమన్ రిఫర్, జెర్మరైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథనజ్, జోషువా డి సిల్వ, జాసన్ హోల్డర్, రహ్కీం కార్న్‌వాల్, అల్జెరీ జోసఫ్, కెమెర్ రోచ్, జొమెల్ వర్రీకన్
