India Vs Srilanka 2nd Test: పింక్ బాల్ టెస్టును కూడా మూడు రోజుల్లో ముగించేందుకు భారత్ రంగం సిద్ధం చేసుకుంటున్నది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించకపోయినా.. బౌలింగ్ లో మాత్రం ఇరగదీసింది. లంకకు చుక్కలు చూపించింది. 

శ్రీలంతో బెంగళూరు వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తున్నది. రెండో టెస్టులో లంకను ఊపిరాడనీయకుండా చేస్తూ.. ఆట రెండో రోజు ఆ జట్టు లోయరార్డర్ ను ఐదు ఓవర్లలోనే వెనక్కి పంపింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా ధాటికి ఆ జట్టు.. 35.5 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. 

ఓవర్ నైట్ స్కోరు 86-6 వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన లంక బ్యాటర్ డిక్వెల్ల బుమ్రా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. ఆ ఒక్కటే లంక సంతోషించే అంశం. ఇక తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా.. ఎంబుల్డెనియాను బోల్తా కొట్టించాడు. బుుమ్రా వేసిన బంతి ఎంబుల్డెనియా బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్.. లక్మల్ ను బౌల్డ్ చేశాడు. 

Scroll to load tweet…

ఆ మరుసటి ఓవర్లో బుమ్రా.. డిక్వెల్లను కూడా ఔట్ చేశాడు. ఈ టెస్టులో ఇది బుమ్రాకు ఐదో వికెట్. మొత్తంగా 29 టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం 8వ సారి.. అంతేగాక లంకపై భారత సీమర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన (5-24). స్పిన్నర్లకు స్వర్గధామమైన బెంగళూరు పిచ్ పై బుమ్రా చెలరేగడం విశేషం. ఇక 35వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడబోయిన విశ్వ ఫెర్నాండోను రిషభ్ పంత్ స్టంపౌట్ చేశాడు. దీంతో లంక ఇన్నింగ్స్ కు తెరపడింది.

109 పరుగులకే లంక ఆలౌట్ కావడంతో భారత్ కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. కాగా భారత్ తో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో 1990లో చండీగఢ్ వేదికగా జరిగిన టెస్టులో ఆ జట్టు 82 పరుగులకే ఆలౌట్ అయింది. 

Scroll to load tweet…

లంకపై భారీ ఆధిక్యం సాధించిన భారత్.. తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (4*), రోహిత్ శర్మ (2*) ఆడుతున్నారు.