Ind Vs SA: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్టు ఆడుతుండగా.. కొద్దిసేపట్లో సెంచూరియన్ గ్రౌండ్ లో ఇండియా-దక్షిణాఫ్రికా లు కూడా ఈ టెస్టుతో సిరీస్ కు శ్రీకారం చుట్టనున్నాయి. అసలు బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి..?

డిసెంబర్ 26 వచ్చిందంటే చాలు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలలో అక్కడి క్రికెట్ అభిమానులకు క్రిస్మస్ తర్వాత అంతటి పండుగ వచ్చినట్టే. ఆ దేశాలలో క్రికెట్ సందడి నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్టు ఆడుతుండగా.. కొద్దిసేపట్లో ఇండియా-దక్షిణాఫ్రికా లు కూడా ఈ టెస్టుతో సిరీస్ కు శ్రీకారం చుట్టనున్నాయి. అసలు బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి..? దీనికి ఎందుకు ప్రాముఖ్యత..? అసలు ఈ పేరెలా వచ్చింది..? ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

క్రిస్మస్ వచ్చిందంటే ఆస్ట్రేలియాలో పండుగే. ఆ దేశంలో క్రిస్మస్ తో పాటు దాని తర్వాత క్రికెట్ పండుగ కూడా మొదలవుతుంది. ప్రతి ఏటా డిసెంబర్ 26న అక్కడ టెస్టు మ్యాచ్ జరగాల్సిందే. ఒక్క ఆసీస్ లోనే కాదు.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, కెనడా తో పాటు కామన్వెల్త్ దేశాలలో ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మిగిలిన దేశాలను కాసేపు పక్కనబెడితే.. క్రికెట్ ఆడే దేశాలలో మాత్రం ఈ రోజు నిర్వహించే టెస్టు మ్యాచులకు క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. 

అసలు ఆ పేరెలా వచ్చింది..? 

బాక్సింగ్ డే అంటే ఏమిటి..? అనేదానికి పలు కథనాలు ప్రచారంలో ఉన్నా ముఖ్యంగా రెండైతే భాగా ప్రసిద్ధిగాంచాయి. అందులో ఒకటి.. చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ఉంచిన బాక్సులను ఆ మరుసటి రోజున తెరుస్తారు. అందుకే ఈ రోజును ‘బాక్సింగ్ డే’ అంటారు. ఈ బాక్సులలో గిఫ్టులు, పేదవారి కోసం అవసరమైన వస్తువులు, ఇతరత్రా సామాగ్రి ఉంచుతారు. వీటిని క్రిస్మస్ తర్వాత రోజున తెరిచి వాళ్లకు పంచుతారు. దీనిని కూడా ఒక పండుగలా నిర్వహిస్తారు. అందుకే ఈ రోజుకు ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. మరో కథనం ప్రకారం.. క్రిస్మస్ రోజున కూడా పనిచేసే కార్మికులు, సర్వెంట్లకు గౌరవసూచకంగా ఈ రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.

కాగా ఆసీస్ లోని మరో కథనం ప్రకారం.. 1865లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా-న్యూ సౌత్ వేల్స్ మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వల్ల రెండు జట్లలోని ఆటగాళ్లు, సిబ్బంది.. బాక్సింగ్ డే వేడుకల్లో పాలు పంచుకోలేదట. దీంతో అప్పట్నుంచి ఈ రోజున ఆడే టెస్టును కంగారూలు ‘బాక్సింగ్ డే టెస్ట్’ అంటుంటారు. 

ఫస్ట్ బాక్సింగ్ డే టెస్టు ఎక్కడ జరిగింది..? 

తొలి బాక్సింగ్ డే టెస్టు.. 1950లో ప్రారంభమైంది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్, ఆ ఆటలో వారి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా మధ్యే తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ నే విజయం వరించింది. అప్పట్లో క్రికెట్ ఆడే కామన్వెల్త్ దేశాలన్నీ డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదుగానీ ఆ తర్వాత మాత్రం ఈ ట్రెండ్ జోరందుకుంది. 1950 నుంచి 1975 మధ్య కాలంలో కేవలం 5 బాక్సింగ్ డే టెస్టులు మాత్రమే జరిగాయి. ఇక 1980 నుంచి ఆస్ట్రేలియాలో క్రమం తప్పకుండా.. డిసెంబర్ 26న టెస్టు మ్యాచ్ ఆడేలా ప్రణాళిక చేసుకుంటున్నది. 

Scroll to load tweet…

వేదిక ఫిక్స్.. 

2013లో ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు రికార్డు స్థాయిలో 91,112 మంది ఫ్యాన్స్ హాజరయ్యారట. బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ శాశ్వత వేదిక. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం పోర్ట్ ఎలిజిబెత్, డర్బన్, కేప్ టౌన్, సెంచూరీయన్ లలో ఆడతారు.

Scroll to load tweet…

దక్షిణాఫ్రికాతో భారత్ కూడా.. 

సౌతాఫ్రికా కూడా కామన్వెల్త్ దేశమే. 1992 డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా.. టీమిండియాతో బాక్సింగ్ డే టెస్టులను నిర్వహిస్తున్నది. అంతకుముందు ఆ జట్టు ఆసీస్, ఇంగ్లాండ్ తో కూడా ఈ రోజున మ్యాచులు ఆడింది. ప్రస్తుతం తొలి టెస్టు జరుగబోయే సెంచూరీయన్ వేదికపై ఇరు జట్టు 5 సార్లు బాక్సింగ్ డే టెస్టులు ఆడాయి. 1992, 96, 2006, 2010, 2013లలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొట్టింది. అయితే ఈ ఐదింటిలో భారత్ ఒక్క మ్యాచ్ డ్రా చేసుకోగా నాలుగింటిలో ఓడింది. 2016 నుంచి 2020 వరకు జరిగిన బాక్సింగ్ డే టెస్టులలో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు.