India Vs South Africa: వాండరర్స్ లో ఇంతవరకు ఓడని రికార్డు ఉన్న టీమిండియా దానిని నిలబెట్టుకుంటుందా..? తొలి టెస్టును గెలిచి సిరీస్ మీద కన్నేసిన భారత్ చరిత్ర సృష్టిస్తుందా..? ఊరించే లక్ష్యాన్ని సఫారీలు ఛేదించి సిరీస్ ను సమం చేస్తారా..? భారత అభిమానుల్లో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్నలివే..
టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు.. సఫారీల ముందు 240 పరుగుల ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. వాండరర్స్ లో ఇంతవరకు సఫారీల మీద ఓడని రికార్డు ఉన్నా టీమిండియా.. మరి దానిని కాపాడుకుంటుందా..? అలా జరిగితే భారత్ చరిత్ర సృష్టించినట్టే. రికార్డులు కూడా మనకే అనుకూలంగా ఉన్నాయి. గతంలో దక్షిణాఫ్రికా జట్టు చేజింగ్ చేస్తూ.. 217 పరుగులను ఛేదించింది. మరి ఇప్పుడు రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కానీ...
గత పర్యటనలో భాగంగా భారత జట్టు వాండరర్స్ విజయంలో తక్కువ స్కోర్లతోనే గెలుపొందింది. 2018 పర్యటనలో భాగంగా జరిగిన టెస్టులో భారత జట్టు.. సఫారీల ముందు 241 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 177కే నిలువరించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. ఆ మ్యాచులో భారత పేస్ త్రయంలోని సభ్యుడు మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, క్వింటన్ డికాక్ వంటి యోధానుయోధులను మట్టి కరిపించిన టీమిండియా బౌలర్లు.. ఇప్పుడు అనుభవం పెద్దగా లేని సౌతాఫ్రికాను ఓడిస్తారా..?
ఇక వాండరర్స్ పిచ్ పై సౌతాఫ్రికా చివరిసారి 2005-06 లో న్యూజిలాండ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత ఇక్కడ సఫారీలు చేజింగ్ లో చేతులెత్తేస్తూనే ఉన్నారు. ఈ పిచ్ పై అత్యధిక పరుగుల లక్ష్యం ఛేదించిన జట్టు ఆసీస్, విండీస్ లు మాత్రమే. 2006లో ఆసీస్.. సఫారీలు నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత 2011 లో వాండరర్స్ పిచ్ పై ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులో సౌతాఫ్రికా ఉంచిన 310 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.
ఇక వాండరర్స్ స్టేడియంలో గడిచిన 11 టెస్టుల (ఛేదనలో) లో దక్షిణాఫ్రికా ఒక్కసారి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక్కడ 2006తో పాటు 2018 లో జరిగిన టెస్టులలో భారత జట్టు విజయాలు సాధించింది.
ఇదిలాఉండగా రెండో టెస్టులో ఛేదన మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతున్నది. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగుల చేసింది. ఈ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ మార్క్రమ్.. (28 బంతుల్లో 24.. 5 ఫోర్లు) జోరుమీదున్నాడు. వరుస ఫోర్లతో అతడు భారత బౌలర్ల మీద ఒత్తిడి తెస్తున్నాడు. మరోవైపు సారథి డీన్ ఎల్గర్ (14 బంతుల్లో 10) నిలకడగా ఆడుతున్నాడు. మూడో సెషన్ లో భారత బౌలర్లు కనీసం నాలుగైదు వికెట్లు తీయగలిగితే పేస్ కు సహకరిస్తున్న వాండరర్స్ పిచ్ పై నాలుగో రోజు సఫారీలను పడగొట్టడం పెద్ద విషయమేమీ కాదు.
ఏదేమైనా ఊరించే లక్ష్యం కావడంతో ఈ టెస్టులో ఇరు జట్లకు గెలిచే అవకాశాలున్నాయి. భారత బౌలర్లు చెలరేగితే మాత్రం సఫారీలకు కష్టాలు తప్పవు. మరి భారత పేస్ త్రయంతో పాటు తొలి ఇన్నింగ్సులో 7 వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన శార్దుల్ ఠాకూర్ ఏమేరకు ప్రభావం చూపుతాడో వేచి చూడాల్సి ఉంది.
