Asianet News TeluguAsianet News Telugu

Ind Vs SA: ఆ ముగ్గురు తప్ప అంతా విఫలం.. రెండో ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్.. సఫారీల టార్గెట్ ఎంతంటే..?

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టు సడలించింది.  మూడో సెషన్ కు ముందే ఆలౌటై కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో టీమిండియా 266 పరుగులకే పెవిలియన్ కు చేరింది.

Ind vs SA: Team India All out 266 in Second Innings at Wanderers Test, Put 240 Target For South Africa
Author
Hyderabad, First Published Jan 5, 2022, 5:51 PM IST

జోహన్నస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత  బ్యాటర్లు పట్టు సడలించారు. మన బ్యాటర్లు ఈరోజంతా ఆడతారని భారత అభిమానులు ఆశించినా.. ఆమేరకు  తొలి సెషన్ లో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాలు రాణించినా మిడిలార్డర్ వైఫల్యంతో భారత జట్టు 60.1 ఓవర్లలో  266 పరుగులు చేసింది. ఫలితంగా 239 పరుగుల విలువైన ఆధిక్యాన్ని సంపాదించింది. వాండరర్స్ టెస్టులో భారత్ పై ఇప్పటివరకూ నెగ్గని దక్షిణాఫ్రికా.. ఈ మ్యాచులో విజయం సాధించాలంటే 240 పరుగులు చేయాల్సి ఉంది. మరి భారత బౌలర్లు సఫారీలను ఏ మేరకు అడ్డుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. తొలి సెషన్ లో భాగానే ఆడింది. కొంత కాలంగా ఫామ్ కోల్పోయి కెరీర్ ప్రమాదంలో పడేసుకున్న భారత వెటరన్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాలు మెరుగైన ప్రదర్శన చేశారు. 86 బంతులాడిన పుజారా.. 53 పరుగులు చేశాడు. 78 బంతులాడిన రహానే.. 58 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ ఇద్దరి తర్వాత హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్) ఒక్కడే సఫారీల బౌలింగ్ ను తట్టుకుని నిలబడ్డాడు. 

 

రహానే, పుజారాలు నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (3 బంతుల్లో 0) డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రవిచంద్రన్ అశ్విన్ (14 బంతుల్లో 16) దూకుడుగా ఆడినట్టే కనిపించినా అతడు కూడా  ఎంగిడి బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. 

ఆ సమయంలో హనుమ విహారితో కలిసి దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్ లో దెబ్బతీసిన శార్దుల్ ఠాకూర్ (24 బంతుల్లో 28) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ షాట్లు ఆడారు. కానీ దూకుడుగా ఆడుతున్న ఠాకూర్ ను జాన్సేన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టెయిలెండర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. షమీ (0), బుమ్రా (7), సిరాజ్ (0) లు పెద్దగా పోరాడకుండానే వెనుదిరిగారు. ఫలితంగా భారత జట్టు 60.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

 

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడాతో పాటు ఎంగిడి, జాన్సేన్ కు తలో మూడు వికెట్లు దక్కగా.. ఓలివర్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతుకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 202 పరుగులకే  ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 229 రన్స్ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios