Asianet News TeluguAsianet News Telugu

దొరికిన బంతిని తురుముదాం.. దొరకని బంతిని తరుముదాం.. రెండో టీ20లో భారత బ్యాటింగ్‌కు సఫారీ బౌలర్ల విలవిల

IND vs SA T20I:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది.  క్రీజులోకి వచ్చిన ప్రతీ భారత బ్యాటర్  సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. సూర్యకుమార్ యాదవ్ అయితే  ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 
 

IND vs SA T20I Live: India Sets 238 Target For South Africa
Author
First Published Oct 2, 2022, 8:48 PM IST

భారత్-దక్షిణాఫ్రికా మధ్య గువహతి వేదికగా జరుగుతున్న రెండో టీ20కి ముందు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ వేసిన అంచనాలు తప్పాయి. ఇక్కడ వర్షం ఆకాశం నుంచి పడలేదు గానీ భారత బ్యాటర్ల నుంచి పరుగుల కుంభవృష్టి కురిసింది. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బాదుడే మంత్రంగా చెలరేగాడు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (28 బంతుల్లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రోహిత్ శర్మ (37 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్స్)  ఇచ్చిన ఆరంభాన్ని సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్) నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.

ముఖ్యంగా సూర్య క్రీజులో ఉన్నంతసేపు బంతి  గాల్లోనే ఉందంటే అతిశయెక్తి కాదు. బౌలర్ ఎవరన్నది సంబంధం లేకుండా.. బంతి ఎటు వస్తుందన్నది పట్టించుకోకుండా దొరికిన బంతిని దొరికినట్టుగా కసిగా బాదాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే దుబాయ్ లో ఎఆర్ రెహ్మాన్ సంగీత విభావరికి ప్రముఖ వాయిధ్యకారుడు శివమణి డ్రమ్స్ వాయించినట్టుగా సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20లలో  ఇది నాలుగో అత్యధిక స్కోరు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ కు ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరిపోయే శుభారంభాన్నిచ్చారు.  రబాడా వేసిన తొలి ఓవర్ తొలి బంతికే బౌండరీ బాదిన రాహుల్.. రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 96 పరుగులు జోడించారు.  

పార్నెల్ వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన రోహిత్.. ఎంగిడి బౌలింగ్ లో సిక్సర్ బాదాడు.  నాలుగో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు కొట్టగా.. రోహిత్ మరోసారి బంతిని బౌండరీకి పంపాడు. కేశవ్ మహారాజ్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్  మరో రెండు ఫోర్లు కొట్టాడు.  దీంతో తొలి పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. రోహిత్ - రాహుల్ కు ఇది టీ20లలో ఇది 15వ ఫిఫ్టీ భాగస్వామ్యం.  ఫలితంగా ఈ ఇద్దరూ కలిసి టీ20లలో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్ (14) లను దాటారు. 

ఇక నోర్త్జ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో భారత్ పరుగుల పండుగ చేసుకుంది. ఆ ఓవర్లో రాహుల్ 4,6 బాది రోహిత్ కు స్ట్రైక్ ఇచ్చాడు. రోహత్ కూడా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో  అదరగొట్టాడు. ఈ ఓవర్లో భారత్ కు 21 పరుగులొచ్చాయి. అయితే సాఫీగా సాగుతున్న ఈ భాగస్వామ్యాన్ని  కేశవ్ మహారాజ్ విడదీశాడు. అతడు వేసిన పదో ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ భారీ షాట్ ఆడి డీప్ మిడ్ వికెట్ వద్ద   ట్రిస్టన్ స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ తొలివికెట్ కోల్పోయింది. 

రోహిత్ నిష్క్రమించాక మార్క్రమ్ వేసిన బౌలింగ్ లో సిక్సర్ కొట్టి ఈ సిరీస్ లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు రాహుల్. టీ20లలో అతడికి ఇది 20వ హాఫ్ సెంచరీ. కానీ కేశవ్ తన తర్వాతి ఓవర్లో రాహుల్ ను ఎల్బీడబ్ల్యూ ద్వారా వెనక్కిపంపాడు. 

ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ లు సఫారీ బౌలర్లను తుక్కుతుక్కుగా బాదాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా.. బాదుడే మంత్రంగా  సూర్య తాను టీ20లలో ఎందుకు నెంబర్ వన్ బ్యాటరో మరోసారి నిరూపించాడు. ఎదుర్కున్న రెండో బంతికే  బౌండరీతో  ఖాతా తెరిచిన 
సూర్య.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రబాడా వేసిన 15వ ఓవర్లో.. 6, 4, 4, 6, తో 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఎంగిడి వంతు.. ఆ ఓవర్లో 6,4 తో సూర్య రెచ్చిపోయాడు. ఇక పార్నెల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన సూర్య.. 18 బంతుల్లోనే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

 

సూర్య ప్రతాపాన్ని చూసిన కోహ్లీ.. పార్నెల్ ఓవర్లోనే చివరి మూడు బంతులను 6, 4, 4 బాదాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్య.. నోర్త్జ్ బౌలింగ్ లో కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. కానీ అప్పటికే టీమిండియా 200 పరుగులు దాటింది. రబాడా వేసిన చివరి ఓవర్లో కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్) 4, 6, 6 తో 18 పరుగులొచ్చాయి. తద్వారా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios