Asianet News TeluguAsianet News Telugu

Ind Vs SA: సఫారీలను ఆలౌట్ చేసిన టీమిండియా పేస్ దళం.. శార్దూల్ ఠాకూర్ కు ఏడు వికెట్లు

Shardul Thakur: రెండో  రోజు ఆటలో తొలి సెషన్ లో సౌతాఫ్రికా బ్యాటర్లను నిలువరించలేకపోయిన భారత బౌలర్లు.. లంచ్ కు ముందు శార్దూల్ ఠాకూర్ గోల్డెన్ స్పెల్ తో రెచ్చిపోయారు.  ఠాకూర్ ఏడు వికెట్లు తీశాడు. 

Ind Vs SA: South Africa All out by 229 In First Innings Against India, Shardul Tahakur Gets 7 Wickets
Author
Hyderabad, First Published Jan 4, 2022, 8:03 PM IST

టీమిండియా  బౌలర్లు అదరగొట్టారు.  వాండరర్స్ పిచ్ పై బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు  ఆకట్లుకునే ప్రదర్శన చేశారు. ముఖ్యంగా రెండో రోజు ఆటలో భారత యువ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూరే హీరో. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు బ్యాటర్లను అతడు కకావికలం చేశాడు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఓవర్ నైట్ స్కోరు 35-1 వద్ద రెండో  రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి సెషన్ లో నిలకడగానే ఆడింది. ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ (28), పీటర్సన్ (62) లు ఆకట్టుకున్నారు. భారత పేస్ త్రయం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లను ఈ ఇద్దరూ ధీటుగా ఎదుర్కున్నారు. 

అయితే  భారత తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్.. శార్దూల్ ను క్రీజులోకి దించాక సౌతాఫ్రికా ఫేట్ మారిపోయింది. లంచ్ కు ముందు వరుస ఓవర్లలో అతడు ఎల్గర్, పీటర్సన్, డసెన్ (1)  ను పెవిలియన్ కు పంపాడు. ఇక లంచ్ తర్వాత బవుమా (51) తో కలిసి వికెట్ కీపర్ వెరెన్నే (21) కాసేపు ప్రతిఘటించినా వాళ్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఆ ఇద్దరినీ ఠాకూర్ రెండు అద్భుతమైన డెలివరీలతో బోల్తా కొట్టించాడు.

 

మూడో సెషన్ ప్రారంభమయ్యేసరికి  ఆరు వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టు..  లోయరార్డర్ బ్యాటర్ కేశవ్ మహారాజ్ (21) మెరవడంతో  తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను అధిగమించింది. కానీ కేశవ్ మహారాజ్ ను బుమ్రా బోల్డ్ చేశాడు. ఎంగిడిని ఠాకూర్ పెవిలియన్ కు పంపడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 229 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 17.5 ఓవర్లు వేసి 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. 

ఇదిలాఉండగా.. వాండరర్స్ లో ఐదు వికెట్లు తీసిన ఆరో బౌలర్ గా  ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే (6-53), జవగళ్ శ్రీనాథ్ (5-10), ఎస్. శ్రీశాంత్ (5-40), బుమ్రా (5-54), మహ్మద్ షమీ (5-29) ఈ ఫీట్ సాధించగా.. తాజాగా ఠాకూర్ వారి సరసన నిలిచాడు. అంతేగాక దక్షిణాఫ్రికాలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీసిన తొలి బౌలర్ కూడా ఠాకూరే. భారత్ నుంచే కాదు.. ఆసియా లోని క్రికెట్ ఆడే దేశాలలో కూడా ఈ  ఘనత సాధించిన బౌలర్  అతడే. 

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  టీమిండియా.. 4 ఓవర్లు ముగిసేసరికి 11 పరుగులతో ఆడుతున్నది. కెఎల్ రాహుల్ (3 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (8 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ మరో 16 పరుగులు వెనుకబడి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios