చెన్నై: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి రోజు ఆటలో ఇంగ్లండు స్పిన్నర్ మొయిన్ అలీ రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పెవిలియన్ కు పంపించడం ద్వారా ఆ రికార్డును సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్సులో మొయిన్ అలీ వేసిన 22వ ఓవరు రెండో బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు 

బంతిని కోహ్లీ అంచనా వేసే లోపే అది వికెట్లపైకి దూసుకుపోయింది. ఆ బంతికి కోహ్లీ కూడా షాకయ్యాడు. బంతి వికెట్లను తాకిందా, వికెట్ కీప్ర్ చేతులు తగిలి వికెట్లు పడ్డాయా అనే సందేహం కోహ్లీ మొహంలో కనిపించింది. అయితే, అది క్లియర్ ఔట్ కావడంతో కోహ్లీ వెనుదిరగక తప్పలేదు. 

కాగా, దాంతోనే మొయిన్ అలీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టెస్టు మ్యాచుల్లో కోహ్లీని డకౌట్ చేసిన తొలి స్పిన్నర్ గా అతను రికార్డు సృష్టించాడు టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లీ 11 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే, స్నిన్నర్ బౌలింగ్ లో అతను డకౌట్ కావడం ఇదే తొలిసారి. టెస్టుల్లో కోహ్లీని డౌకట్ చేసిన బౌలర్లలో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ప్యాట్ కమిన్స్, బెన్ హెల్పెనాస్, స్టార్క్, లక్కాల్, అబు జాయద్, ప్లంకెట్, రవి రాంపాల్, కీమర్ రోచ్ ఉన్నారు వీరంతా పేసర్లు, మీడియం పేసర్లు. 

ఇదిలావుంటే, శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నంగ్సులో ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చెలరేగి ఆడడంతో, అజింక్యా రహానే నిలకడగా ఆడడంతో భారత్ ఆ స్కోరు సాధించగలిగింది. రోహిత్ శర్మ 231 బంతుల్లో 161 పరుగులు చేయగా, అజింక్యా రహానే 67 పరుగులు చేశాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 86 పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, రహానే కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 33 పరుగులతో, అక్షర్ పటేల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.