ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి భారత జట్టుకి షాక్ ఇచ్చాడు. 420 పరుగుల భారీ లక్ష్యచేధనలో 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

83 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్, అదే ఓవర్‌లో అజింకా రహానేని కూడా పెవిలియన్ చేర్చాడు. శుబ్‌మన్ గిల్, రహానే ఇద్దరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు.

గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింకా రహానే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు అప్పీలు చేసిన ఇంగ్లాండ్, అంపైర్ కాల్ నిర్ణయం వల్ల వికెట్ పొందలేకపోయింది. అయితే ఆ తర్వాతి బంతికే రహానేని క్లీన్ బౌల్డ్ చేశాడు అండర్సన్. 27 ఓవర్లలోనే 92 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా.