IPL 2023: మరో రెండు వారాల్లో మొదలుకాబోయే  ఐపీఎల్- 16 వ సీజన్ కు  ముందు కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ గాయంతో   ఈ  సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. 

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం ఐపీఎల్ లో కేకేఆర్ కు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉన్న అయ్యర్.. ఐపీఎల్ -16 మొత్తం సీజన్ కు దూరమవుతాడని వార్తలు వస్తుండగా ఫస్టాఫ్ మాత్రం తప్పకుండా ఆడడని భారత క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ కు కొత్త సారథి ఎవరు..? అన్న చర్చ సాగుతోంది. 

కేకేఆర్ కు శ్రేయాస్ అయ్యర్ కాకుంటే నితీశ్ రాణా, సునీల్ నరైన్, టిమ్ సౌథీ లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కొత్త కెప్టెన్ గా ఎవరిని ప్రకటిస్తారని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో కేకేఆర్ తమ కొత్త కెప్టెన్ హింట్ ఇచ్చిందా..? అంటే ఆ జట్టు అభిమానులు నిజమే అంటున్నారు. ఓ అభిమాని పెట్టిన పోస్టుకు కేకేఆర్ ట్విటర్ ఖాతా ద్వారా.. తమ కొత్త సారథిని ఆ జట్టు హిట్టర్ రింకూ సింగ్ అని ప్రకటించి తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసింది. 

View post on Instagram

ఐపీఎల్ సీజన్ కు ముందు కేకేఆర్ ప్రీ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా పాల్గొంటున్నాడు. ఈ వీడియోలో రింకూ సింగ్.. స్వీప్ షాట్ కొట్టి అదరగొట్టాడు. ఈ వీడియోకు కేకేఆర్ అభిమాని ఒకరు.. ‘గేమ్ ఛేంజర్ రింకూ..’అని రాసుకొచ్చాడు. దానికి కేకేఆర్ రిప్లై ఇస్తూ.. ‘మా స్కిప్పర్ (కెప్టెన్)’అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దీంతో కేకేఆర్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ‘నిజమా.. రింకూకు కెప్టెన్సీ ఇచ్చారా..?’, ‘ఇది నిజంగా షాకింగ్ గా ఉంది..’, ‘రింకూకు కెప్టెన్సీ ఇచ్చారా..? మరి రాణా, సౌథీ, నరైన్ ల సంగతి ..’, ‘ఇది సాహసోపేత నిర్ణయం..’అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత కేకేఆర్ ఈ పోస్టును డిలీట్ చేసింది. 

ఇక ఐపీఎల్ లో కేకేఆర్.. ఏప్రిల్ ఒకటిన తమ మొదటి మ్యాచ్ ను పంజాబ్ తో ఆడనుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో కేకేఆర్.. రూ. 12.25 కోట్లతో శ్రేయాస్ అయ్యర్ ను కొనుగోలు చేసి సారథిగా నియమించిన విషయం తెలిసిందే.