ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ నిర్వహించే యోచనలో ఐసీసీ.. ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్... పోటీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్ మ్యాచ్‌ని ఆరు రోజుల పాటు నిర్వహించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇంగ్లాండ్‌లో వర్షాల కారణంగా సౌంతిప్టన్‌ వేదికగా జరిగిన మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ పెద్దగా థ్రిల్‌ని కలిగించలేకపోయింది. న్యూజిలాండ్‌కి వాతావరణ పరిస్థితులు కూడా కలిసి వచ్చి, వారికి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐసీసీ టైటిల్ విజయాన్ని అందించాయి.

ఇంగ్లాండ్‌లో వాతావరణ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉండి కూడా, అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి మెగా ఈవెంట్స్‌ని నిర్వహించడంపై ఐసీసీపై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే ఐసీసీ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత స్టేడియం లార్డ్స్‌లో నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు నిర్వహాకులు. ఈసారి కరోనా కేసుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయి, వైరస్ భయం రూపుమానిపోవడంతో లార్డ్స్‌లో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పెడితే, బాగుంటుందని భావిస్తున్నారు నిర్వహాకులు...

నిజానికి మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కూడా లార్డ్స్‌లోనే జరగాల్సింది. అయితే కరోనా కేసులు, వర్షాల కారణంగా ఆఖర్లో వేదిక సౌంతిప్టన్‌కి మారింది. లార్డ్స్‌లో మ్యాచ్ జరిగి ఉంటే, ఇరు జట్లకి సమాన అవకాశాలు ఉండేవని... భారత జట్టు టైటిల్ గెలిచేదనే వాదనలు కూడా వినిపించాయి...

వచ్చే ఏడాది ఏప్రిల్ మాసానికి డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ షెడ్యూల్ ముగుస్తుంది. జూన్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడ్డాయి. దీంతో అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది భారత జట్టు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని, మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ అందుకుంది న్యూజిలాండ్...

అయితే ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కి న్యూజిలాండ్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడిన న్యూజిలాండ్ 2 విజయాలు అందుకుని మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ విజయాల శాతం 38.89 మాత్రమే...

8 టెస్టుల్లో 5 విజయాలు అందుకుని, మూడు టెస్టులు డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా... డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంటే సౌతాఫ్రికా 7 టెస్టులు ఆడి 5 విజయాలు, 2 పరాజయాలతో 71.43 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉంది...

భారత జట్టు ఇప్పటికే 12 టెస్టులు ఆడి 6 విజయాలు అందుకుని, 3 మ్యాచుల్లో ఓడింది. 2 టెస్టులు డ్రా చేసుకోగా ఓ టెస్టు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో విజయం సాధించడం భారత జట్టుకి కీలకంగా మారింది...

భారత జట్టు తర్వాతి స్థానాల్లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా ఫైనల్‌కి ఆతిథ్యం ఇవ్వనున్న ఇంగ్లాండ్.. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడి ఒకే ఒక్క టెస్టులో విజయం అందుకుంది. 7 టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్, 4 టెస్టులను డ్రా చేసుకోగలిగింది. ప్రస్తుతం 12.5 శాతం విజయాలతో ఉన్న ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించడం అసాధ్యమే...