ICC World cup 2023: విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్... న్యూజిలాండ్‌ని ఓడించి టేబుల్ టాపర్‌గా టీమిండియా..

Virat Kohli: 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలిచిన టీమిండియా... 95 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన భారత జట్టు.. 

ICC World cup 2023: Virat Kohli fantastic Innings, Team India beats New Zealand CRA

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించింది. ఇప్పటిదాకా ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచులన్నీ చప్పగా సాగుతూ, వన్‌సైడెడ్‌గా సాగగా టేబుల్ టాపర్స్ ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులతో పాటు విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది.  

274 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కింది. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కి 71 పరుగులు జోడించాడు. రోహిత్ శర్మను బౌల్డ్ చూసిన లూకీ ఫర్గూసన్, ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్‌ని పెవిలియన్ చేర్చాడు.

31 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అత్యంత వేగంగా 2 వేల వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రేయాస్ అయ్యర్ వస్తూనే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 15.4 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది భారత జట్టు. ఈ దశలో దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో న్యూజిలాండ్ ప్లేయర్లు అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటికి భారత బ్యాటర్లు కూడా బంతి కనిపించడం లేదని అభ్యంతరం తెలపడంతో ఆటను కొద్దిసేపు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..

పొగ మంచు తొలిగిపోగానే ఆట తిరిగి ప్రారంభమైంది. శ్రేయాస్ అయ్యర్- విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు.  29 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

కెఎల్ రాహుల్- విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న న్యూజిలాండ్‌కి ఫలితం దక్కింది..

4 బంతుల్లో 2 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత్. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. సింగిల్స్,  టీమిండియా విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో 6, 4 బాదిన విరాట్ కోహ్లీ... సస్పెన్స్‌కి తెరదించాడు. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. టీమిండియా విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీ సెంచరీకి 7 పరుగుల దూరంలో నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో 2 పరుగులు తీసిన విరాట్ కోహ్లీ, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..

104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షమీ సింగిల్ తీయగా జడేజా ఫోర్ బాది మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios