2003 వన్డే వరల్డ్ కప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్... ఆ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. 20 ఏళ్లుగా ఎవ్వరికీ అందకుండా ఉన్న సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. 

ఇంతకుముందు మాథ్యూ హేడెన్ 2007లో, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ 2019లో సచిన్ టెండూల్కర్ రికార్డుకు దగ్గరగా వచ్చినా 673 పరుగుల మ్యాజిక్ ఫిగర్‌ని మాత్రం అందుకోలేకపోయారు. సచిన్ టెండూల్కర్ 2003 వన్డే వరల్డ్ కప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లోనూ ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు. 

ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్, 2019లో షకీబ్ అల్ హసన్ 7 సార్లు, 50+ స్కోర్లు నమోదు చేశారు. విరాట్‌కి ఈ వరల్డ్ కప్‌లో ఇది 8వ 50+ స్కోరు..

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 731 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 740 పరుగులకు చేరుకున్నాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3కి అధిగమించాడు విరాట్ కోహ్లీ. 13704 పరుగులు చేసిన రికీ పాంటింగ్‌ని దాటేసిన విరాట్ కోహ్లీ, 18426 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, 14234 పరుగులు చేసిన కుమార సంగర్కర తర్వాతి స్థానంలో నిలిచాడు.