ట్రావిస్ హెడ్ సెంచరీ! రాణించిన డేవిడ్ వార్నర్... న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టిన ఆస్ట్రేలియా...
Australia vs New Zealand: 49.2 ఓవర్లలో 388 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా... ట్రావిస్ హెడ్ సెంచరీ, 81 పరుగులు చేసి అవుటైన డేవిడ్ వార్నర్... ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ధర్మశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ కలిసి ఆస్ట్రేలియాకి మెరుపు ఆరంభం అందించారు. ఈ ఇద్దరూ న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకోవడంతో 19 ఓవర్లలోనే 175 పరుగులు చేసింది ఆస్ట్రేలియా..
65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరు 200 దాటేసింది. ఆస్ట్రేలియా ఈజీగా 400+ స్కోరు చేసేలా కనిపించింది.
67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, సెంచరీతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్‌ని కూడా గ్లెన్ ఫిలిప్స్ అవుట్ చేశాడు.
అయితే మిడిల్ ఆర్డర్‌తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 2 ఫోర్లతో 36 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు, మార్నస్ లబుషేన్ 26 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు..
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 5 ఫోరలు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా జోష్ ఇంగ్లీష్ 28 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 స4క్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు..
మిచెల్ స్టార్క్ 1 పరుగు చేయగా ఆడమ్ జంపా డకౌట్ అయ్యాడు. 387/6 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా ఒక్క పరుగు తేడాలో 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవర్‌లో జోష్ ఇంగ్లీష్, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలను అవుట్ చేశాడు.