Asianet News TeluguAsianet News Telugu

మహ్మద్ షమీ రికార్డు ఫీట్! సిరాజ్ సెన్సేషన్... లంకను చిత్తు చేసి సెమీస్ చేరిన టీమిండియా..

వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మహ్మద్ షమీ! అత్యధిక సార్లు 4+ వికెట్లు తీసిన బ్యాటర్‌గానూ చరిత్ర... శ్రీలంకపై 302 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. 

ICC World cup 2023: Team India beats Sri Lanka with huge difference, confirms Semi final berth CRA
Author
First Published Nov 2, 2023, 8:38 PM IST

మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడో విజయంతో అధికారికంగా సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది భారత్. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో అఖండ విజయం అందుకుంది టీమిండియా. 358 పరుగుల లక్ష్యఛేదనలో 19.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 55 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. 


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి టాప్ క్లాస్ టీమ్ బ్యాటర్లను గడగడలాడించిన భారత బౌలర్లు, శ్రీలంకపై చెలరేగిపోతున్నారు. 358 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక, 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది..

ఇన్నింగ్స్ మొదటి బంతికి పథుమ్ నిశ్శంకని అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. తన ఓవర్‌లో మొదటి బంతికి దిముత్ కరుణరత్నేని అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఆ తర్వాతి బంతికే సధీర సమరవిక్రమ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే రివ్యూ తీసుకున్న లంకకు అనుకూలంగా ఫలితం దక్కింది..

అయితే అదే ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సమరవిక్రమ. 3 ఓవర్లు ముగిసే సమయానికి 3 పరుగులు మాత్రమే చేసి, 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 10 బంతులు ఆడిన కుసాల్ మెండిస్‌ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 24 బంతులాడి 1 పరుగు చేసిన అసలంకను అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఆ తర్వాతి బంతికి హేమంతని పెవిలియన్‌కి చేర్చాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేసింది శ్రీలంక.. 

6 బంతులు ఆడిన దుస్మంత ఛమీరాని మహ్మద్ షమీ అవుట్ చేశాడు. అంపైర్ వైడ్‌గా ప్రకటించినా కెఎల్ రాహుల్ చెప్పడంతో రివ్యూ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది. ఆ తర్వాతి ఓవర్‌లో ఏంజెలో మాథ్యూస్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ..

25 బంతులు ఆడిన ఏంజెలో మాథ్యూస్, ఓ బౌండరీతో 12 పరుగులు చేసి శ్రీలంక ఇన్నింగ్స్‌లో టాప్ 8లో డబుల్ డిజిట్ స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మాథ్యూస్ వికెట్‌తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు 4+ వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు మహ్మద్ షమీ. మిచెల్ స్టార్క్ 24 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు 4+ వికెట్లు తీస్తే, మహ్మద్ షమీ 14 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఈ ఫీట్ సాధించాడు..

ఇంతకుముందు జహీర్ ఖాన్ 23 ఇన్నింగ్స్‌ల్లో, జవగళ్‌నాథ్ 33 ఇన్నింగ్స్‌ల్లో 44 వరల్డ్ కప్ వికెట్లు తీస్తే, మహ్మద్ షమీ 14 ఇన్నింగ్స్‌ల్లోనే 45 వికెట్లు తీసి... టీమిండియా తరుపున అత్యధిక వరల్డ్ కప్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

రజిత, తీక్షణ కలిసి 9వ వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన కసున్ రజిత, షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5 పరుగులు చేసిన మధుశంకను జడేజా అవుట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది.     


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ రెండో బంతికే అవుటైనా శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో రాణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios