ICC World cup 2023: చిన్నస్వామిలో టీమిండియా చెడుగుడు... వరల్డ్ కప్ మ్యాచ్‌ని ప్రాక్టీస్ గేమ్‌లా గెలిచి...
410 పరుగుల లక్ష్యఛేదనలో 250 పరుగులకి ఆలౌట్ అయిన నెదర్లాండ్స్... ఏకంగా 9 బౌలర్లను వాడిన టీమిండియా... ఏళ్ల తర్వాత వికెట్లు తీసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లీగ్ స్టేజీని టీమిండియా అజేయంగా ముగించింది. 9కి 9 మ్యాచుల్లో గెలిచి, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 410 పరుగుల భారీ స్కోరు చేయగా ఆ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 250 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. ఫలితంగా టీమిండియాకి 160 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.
వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్నామనే ఫీలింగ్ ఏ మాత్రం లేకుండా, ప్రాక్టీస్ గేమ్ ఆడుతున్నట్టుగా పసికూన నెదర్లాండ్స్‌ని ఓ ఆటాడుకుంది టీమిండియా. ఎప్పుడో బౌలింగ్ వేయడం మానేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో భారత జట్టు ఏకంగా 9 బౌలర్లను వాడింది. అందులో ఆరుగురు వికెట్లు కూడా తీశారు..
తెలుగు కుర్రాడు తేజ నిడమనురు 39 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేయగా సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 80 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. కోలీన్ ఆకీర్‌మన్ 35, మ్యాక్స్ ఓడాడ్ 30 పరుగులు చేశారు.
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తలా ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ 61, శుబ్‌మన్ గిల్ 51, విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 128, కెఎల్ రాహుల్ 102 పరుగులు చేశారు. భారత టాపార్డర్‌లో ఐదుగురు బ్యాటర్లు 50+ పరుగులు చేయడం ఇదే తొలిసారి..