సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ... వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అవుట్!

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న సౌతాఫ్రికా... వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అవుట్.. 

ICC World cup 2023: South Africa beats Pakistan in Thriller, Keshav Maharaj CRA

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ అసలు సిసలు థ్రిల్లర్‌ని తలపించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గెలిచిన సఫారీలు.. హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు..  వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్, సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. ఇక పాక్, సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే.

చేయాల్సింది 79 బంతుల్లో 36 పరుగులు. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా... అయితే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ని చేజేతులా ఓడే దాకా తెచ్చుకున్న సౌతాఫ్రికా... ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 

271 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికాకి మెరుపు ఆరంభం దక్కింది. షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 4, 4, 4, 4 బాదిన క్వింటన్ డి కాక్ 19 పరుగులు రాబట్టాడు. 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో మహ్మద్ వసీంకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన తెంబ భవుమా, మహ్మద్ వసీం జూనియర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 67 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..

వాన్ దేర్ దుస్సేన్ 21 పరుగులు చేసి ఉసామా మిర్ బౌలింగ్‌లో అవుట్ కాగా క్లాసెన్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ని షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేశాడు.

14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన మార్కో జాన్సెన్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

సౌతాఫ్రికా విజయానికి 21 పరుగులు కావాల్సిన సమయంలో అయిడిన్ మార్క్‌రమ్ అవుట్ కావడంతో మ్యాచ్‌ మళ్లీ పాకిస్తాన్‌ వైపు తిరిగింది. 93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 91 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, ఉసామా మిర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

ఆ తర్వాతి ఓవర్‌లో గెరాల్డ్‌ని షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి కలిసి 10 పరుగులు జోడించారు. అయితే  27 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో లుంగి ఇంగిడి, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

షంసీ రాగానే 2 పరుగులు రాబట్టడంతో సౌతాఫ్రికా విజయానికి 26 బంతుల్లో 9 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆ తర్వాతి బంతికి వైడ్ వచ్చింది. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకుంది పాకిస్తాన్. రిప్లైలో అంపైర్స్ కాల్‌గా రావడంతో హైడ్రామా నడిచింది..

ఆ తర్వాతి ఓవర్‌లో 3 పరుగులు రాగా మహ్మద్ నవాజ్ వేసిన 48వ ఓవర్‌ రెండో బంతికి ఫోర్ బాదిన కేశవ్ మహరాజ్, సౌతాఫ్రికాకి విజయాన్ని అందించాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అబ్దుల్లా షెఫీక్ 9, ఇమామ్ ఉల్ హక్ 12, మహ్మద్ రిజ్వాన్ 31, ఇఫ్తికర్ అహ్మద్ 21 పరుగులు చేసి అవుట్ కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 50 పరుగులు చేశాడు.

షాదబ్ ఖాన్ 43, సౌద్ షకీల్ 52 పరుగులు చేయగా షాహీన్ ఆఫ్రిదీ 2, మహ్మద్ వసీం 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీయగా తబ్రేజ్ షంసీ 4 వికెట్లు తీశాడు. గెరాల్డ్ కాట్జేకి 2 వికెట్లు దక్కగా లుంగి ఎంగిడికి ఓ వికెట్ దక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios