Asianet News TeluguAsianet News Telugu

అసలే వరుస ఓటములు! ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ బౌలర్ అవుట్...

చేతి వేలి గాయంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరమైన రీస్ తోప్లే... మొదటి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ఇంగ్లాండ్.. 

ICC World cup 2023: Reece Topley ruled out of CWC 2023, due to Injury CRA
Author
First Published Oct 23, 2023, 2:01 PM IST | Last Updated Oct 23, 2023, 2:03 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో 2023 మెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించింది ఇంగ్లాండ్. అయితే మొదటి నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకుంది ఇంగ్లాండ్. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై 137 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది..

పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో 69 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 229 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ టాప్ 4లో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అన్నీ గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారెంటీ కూడా లేదు...

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ తగిలింది. స్టార్ బౌలర్ రీస్ తోప్లే, గాయంతో ప్రపంచ కప్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రీస్ తోప్లే, మూడు సార్లు గాయాలతో పెవిలియన్ చేరాడు..

తన బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ కొట్టిన బంతి ఆపే క్రమంలో రీస్ తోప్లే వేలికి గాయమైంది. అతని వేలు విరిగిందని స్కానింగ్‌లో తేలడంతో కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలియచేశారు. దీంతో రీస్ తోప్లే, ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు..

మొదటి 3 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన రీస్ తోప్లే, మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా రీస్ తోప్లేనే. కెరీర్ ఆరంభం నుంచి అనేక గాయాలతో సతమతమవుతున్న రీస్ తోప్లే, 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో బౌండరీ లైన్ స్పాంజ్‌కి తగిలి గాయపడ్డాడు..

రీస్ తోప్లే స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే గత రెండేళ్లుగా జోఫ్రా ఆర్చర్ కూడా వరుసగా గాయాలతో సతమతమవుతున్నాడు. గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ నాలుగు మ్యాచులే ఆడాడు..

మే, 2023 నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు. అయితే అతను పూర్తిగా కోలుకున్నట్టుగా ఇంకా డాక్టర్లు ధృవీకరించలేదు. దీంతో రీస్ తోప్లే గాయపడినా, అతని స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఆడడం అనుమానమే..  రీస్ తోప్లే స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ బ్రేడన్ కర్స్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios