న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనగానే అదే వణుకు... మూడు క్యాచ్‌లు డ్రాప్ చేసిన టీమిండియా...

మూడో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డార్ల్ మిచెల్- రచిన్ రవీంద్ర... మూడు క్యాచులు డ్రాప్ చేసిన భారత ఫీల్డర్లు! సెంచరీ పూర్తి చేసుకున్న డార్ల్ మిచెల్.. 

ICC World cup 2023: Ravindra Jadeja, KL Rahul, Bumrah drops Catch, Darl Mitchell, Rachin Ravindra CRA

2019 వన్డే వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజీలో 7 విజయాలు అందుకుంది టీమిండియా. టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 లోనూ కివీస్ చేతుల్లో ఓటమి తప్పలేదు..

2023 వన్డే వరల్డ్ కప్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది. అత్యధిక క్యాచ్ ఎఫిషియెన్సీ ఉన్న జట్టుగా టాప్‌లో నిలిచింది.. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనగానే టీమిండియా ఫీల్డర్లలో ఓ రకమైన వణుకు మొదలైనట్టు ఉంది.

ఇంతకుముందు మ్యాచుల్లో స్టన్నింగ్ క్యాచులతో మ్యాచులను మలుపు తిప్పిన ఫీల్డర్లే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం విశేషం..  12 పరుగుల దగ్గర రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా జారవిడిచారు. జడేజా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని వదిలివేయడంతో ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న రచిన్ రవీంద్ర.. ఏకంగా 75 పరుగులు చేశాడు. 

ఓ సారి మహ్మద్ షమీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. రివ్యూ తీసుకున్న రచిన్‌కి లైఫ్ దక్కింది. మరోసారి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రచిన్ అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించడం, రివ్యూలో నాటౌట్‌గా తేలడం జరిగిపోయాయి. 

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డార్ల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ని కెఎల్ రాహుల్ వదిలేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డార్ల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ని జస్ప్రిత్ బుమ్రా నేలపాలు చేశాడు... ఇలా ఒకటికి మూడు క్యాచులు జారవిడచడంతో డార్ల్ మిచెల్- రచిన్ రవీంద్ర కలిసి మూడో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

క్యాచ్ డ్రాప్ చేసిన జడేజా, కెఎల్ రాహుల్... బెస్ట్ ఫీల్డర్లుగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్స్ అందుకున్నవాళ్లు కూడా కావడం విశేషం. 

టీమిండియాపై వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా న్యూజిలాండ్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 1979లో జాన్‌రైట్- బ్రాస్‌ ఎడ్గర్ కలిసి 100 పరుగులు జోడించడమే న్యూజిలాండ్‌కి ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియాపై అత్యధిక భాగస్వామ్యం..

87 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ 5 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 

రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డార్ల్ మిచెల్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు... 41 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసిన న్యూజిలాండ్, 280+ స్కోరు దిశగా సాగుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios