హైదరాబాద్‌లో పాక్ క్రికెట్ టీమ్‌కి ఘన స్వాగతం... భారత్‌ని శత్రుదేశంగా పేర్కొన పీసీబీ చీఫ్..
శత్రుదేశంలో క్రికెట్ ఆడడానికి వెళ్లినప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలంటూ వ్యాఖ్యానించిన పీసీబీ చీఫ్... సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ టీమ్, భారత్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో పాక్ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. కొందరు భారత అభిమానులు మాత్రం ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అయితే వీరిని పోలీసులు నియంత్రించి, అక్కడి నుంచి పంపించి వేశారు..
హైదరాబాద్‌లో రెండు వార్మప్ మ్యాచులు ఆడే పాకిస్తాన్ జట్టు, నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌తో మ్యాచులు కూడా ఇక్కడే ఆడనుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులు లేకుండా గేట్లు మూసేసి పాకిస్తాన్ మ్యాచులు నిర్వహించబోతున్నట్టు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది..
2016 తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్, భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 2016లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి వచ్చింది పాకిస్తాన్. 2008లో ముంబై ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. 2012-13లో ఓ ద్వైపాక్షిక సిరీస్ జరిగినా.. ఆ తర్వాత మరోసారి ఉగ్రదాడి జరగడంతో అప్పటినుంచి ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ఇండియా- పాకిస్తాన్ జట్లు తలబడుతున్నాయి..
పాకిస్తాన్ క్రికెట్ టీమ్, ఇండియాలో అడుగుపెట్టగానే పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్, భారత్‌ని శత్రుదేశంగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
‘శత్రుదేశంలో క్రికెట్ ఆడడానికి వెళ్లినప్పుడు ఆటగాళ్లు, తమ మనసును అదుపులో పెట్టుకుని ఉండాలి. ఎక్కడ ఆడుతున్నాం? అనేది గుర్తుంచుకోవాలి. వాళ్లకి మన సపోర్ట్ కావాలి. అప్పుడే వాళ్లు బాగా ఆడగలుగుతారు..’ అంటూ వ్యాఖ్యానించాడు పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్..
భారత్‌ని శత్రుదేశం అనడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత్‌లోని ఓ వర్గం, పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచులు ఆడకూడదని డిమాండ్ చేస్తూ వస్తోంది. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా భారత జట్టు, పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడకూడదని వ్యాఖ్యలు చేశాడు..
అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా- పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి దాదాపు 1 లక్షా 30 వేల మంది అభిమానులు హాజరు కాబోతున్నారు..
నాలుగు నెలలుగా పాక్ ప్లేయర్లకు జీతాలు కూడా చెల్లించలేకపోయింది పీసీబీ. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఐసీసీ ద్వారా బీసీసీఐ అందించిన ఆర్థిక సాయంతో ప్లేయర్లకు భారీగా పారితోషికాలు పెంచుతూ కాంట్రాక్ట్‌లు ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు. భారత క్రికెట్ బోర్డు దయాదాక్షిణ్యాలతో ప్లేయర్లకు జీతాలు ఇస్తున్న పీసీబీ బోర్డు చీఫ్, భారత్‌ని శత్రుదేశంగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు భారత జట్టు అభిమానులు..