ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు... బాబర్ సేనకు ప్లైట్ సిబ్బంది స్పెషల్ సర్ప్రైజ్ (వీడియో)
ఐసిసి ప్రపంచ కప్ 2023 కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పుడే కాదు వెళ్లిపోతుండగా కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆత్మీయ ఆహ్వానం లభించింది.
హైదరాబాద్ : ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ కోసం చాలాకాలం తర్వాత దాయాది పాకిస్థాన్ టీం భారతదేశంలో పర్యటిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్ళ భారత పర్యటనపై పలు అనుమానాలు నెలకొన్నారు. కానీ చిరకాల ప్రత్యర్థులకు కూడా భారత్ లో దక్కుతున్న అతిథి మర్యాదలు చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. చివరకు పాకిస్థాన్ ప్రజలు కూడా ఇలాంటి మర్యాదలు స్వదేశంలో కూడా దక్కవేమో అనుకునేలా పాక్ ఆటగాళ్ళను చూసుకుంటున్నారు భారత్.
వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు భారత్ కు విచ్చేసిన పాకిస్థాన్ గత రెండు వారాలుగా హైదరాబాద్ ఆతిథ్యాన్ని పొందారు. హైదరబాదీ సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు తమదేశాన్ని పోలివుండటంతో బాబర్ సేన చాలా సౌకర్యంగా ఫీలయ్యారు. ఇక్కడి ప్రజల అభిమానం, నోరూరించే బిర్యాని రుచికి ఫిదా అయ్యారు. ఇలా హైదరాబాద్ లో స్వదేశీ ఫీలింగ్ వుండటంతో పాక్ టీం తమ దేశంలో ప్రదర్శననే ఇక్కడ కనబర్చింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండు వార్మాప్ మ్యాచులతో పాటు రెండు ప్రధాన మ్యాచుల్లోనూ పాకిస్థాన్ విజయం సాధించింది.
ఇలా హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ ఆటగాళ్ళు భారత్ తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వెళ్లారు. అయితే అక్కడ తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కంగారు పడిన పాక్ జట్టుకు ఆహ్వానమే ఊహించని స్థాయిలో జరిగింది. బుధవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరింది దాయాది జట్టు. విమానంలో అడుగుపెట్టగానే పాక్ ఆటగాళ్లకు సర్ ప్రైజ్ చేసారు సిబ్బంది. ప్రత్యేకమైన కేక్ ను పాక్ క్రికెటర్లతో కట్ చేయించి అభినందనలు తెలిపారు ఎయిర్ క్రాప్ట్ సిబ్బంది. ఇలా అహ్మదాబాద్ లో అడుగుపెట్టడానికి ముందే ఆత్మీయ ఆహ్వానాన్ని అందుకుంది బాబర్ సేన.
Read More ICC Cricket World Cup 2023 : పాకిస్థాన్ తో ఆటకంటే అమ్మతో మాటే నాకు ముఖ్యం : జస్ప్రిత్ బుమ్రా
ప్రపంచ కప్ లో భాగంగా సెకండ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడ్డ పాక్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించి అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలోనే అరుదైన రికార్డ్ సాధించిన పాక్ జట్టుకు స్పెషల్ కేక్ తో అభినందనలు తెలిపిన విమాన సిబ్బంది ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమపై విమాన సిబ్బంది చూపించిన అభిమానానికి పాక్ క్రికెటర్లు ఫిదా అయ్యారు.