Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: డార్ల్ మిచెల్ అద్భుత సెంచరీ! షమీ సెన్సేషన్... టీమిండియా ముందు భారీ టార్గెట్..

India vs New Zealand: 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. 273 పరుగులకి న్యూజిలాండ్ ఆలౌట్.. 130 పరుగులు చేసి అవుటైన డార్ల్ మిచెల్.. 

ICC World cup 2023:  Mohammed Shami picks wickets, Darl Mitchell scores Century, India vs New Zealand CRA
Author
First Published Oct 22, 2023, 6:03 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లోనూ చేధించి, విజయాలు అందుకుంది భారత జట్టు. అజేయ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

9 బంతులు ఆడిన డివాన్ కాన్వే, సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన విల్ యంగ్, మహ్మద్ షమీ వేసిన మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఆ తర్వాత 12 పరుగుల దగ్గర రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా జారవిడిచారు. ఈ క్యాచ్ పట్టి ఉంటే 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఉండేది న్యూజిలాండ్.  

జడేజా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని వదిలివేయడంతో ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న రచిన్ రవీంద్ర.. ఏకంగా 75 పరుగులు చేశాడు. ఓ సారి మహ్మద్ షమీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. రివ్యూ తీసుకున్న రచిన్‌కి లైఫ్ దక్కింది. మరోసారి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రచిన్ అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించడం, రివ్యూలో నాటౌట్‌గా తేలడం జరిగిపోయాయి. 

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డార్ల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ని కెఎల్ రాహుల్ వదిలేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డార్ల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ని జస్ప్రిత్ బుమ్రా నేలపాలు చేశాడు... ఇలా ఒకటికి మూడు క్యాచులు జారవిడచడంతో డార్ల్ మిచెల్- రచిన్ రవీంద్ర కలిసి మూడో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

టీమిండియాపై వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా న్యూజిలాండ్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. 87 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ 5 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 

రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డార్ల్ మిచెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...  26 బంతుల్లో ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

6 పరుగులు చేసిన మార్క్ చాప్‌మన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మిచెల్ సాంట్నర్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మ్యాట్ హెన్రీకి కూడా బౌల్డ్ చేశాడు షమీ.. 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 130 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాపై సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ మిచెల్..  

చివరి 5 ఓవర్లలో 5వికెట్లు తీసిన భారత బౌలర్లు, 28 పరుగులు మాత్రమే ఇచ్చి, న్యూజిలాండ్ స్కోరును నియంత్రించారు. 2023 వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్ ఆడిన మహ్మద్ షమీ 54 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios