Pakistan vs Sri Lanka: 344 పరుగుల భారీ స్కోరు చేసిన శ్రీలంక.. సెంచరీలు చేసిన కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.. కుసాల్ పెరేరా డకౌట్ కాగా కుసాల్ మెండిస్, పథుమ్ నిశ్శంక కలిసి రెండో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 61 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంకని, షాదబ్ ఖాన్ అవుట్ చేశాడు.
నిశ్శంక అవుటైనా కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ కలిసి మూడో వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసిన కుసాల్ మెండిస్, హసన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
చరిత్ అసలంక 1, ధనంజయ డి సిల్వ 25, కెప్టెన్ దసున్ శనక 12, దునిత్ వెల్లలాగే 10 పరుగులు చేసి అవుట్ కాగా మహీశ్ తీక్షణ డకౌట్ అయ్యాడ. 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసిన సధీర సమరవిక్రమ కూడా హసన్ ఆలీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..
పాక్ బౌలర్లలో హసన్ ఆలీ 10 ఓవర్లలో 71 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా హారీస్ రౌఫ్ 2 వికెట్లు తీశాడు. షాహీన్ ఆఫ్రిదీ కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి 66 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయగలిగాడు. పాక్ బౌలర్లలో పార్ట్ టైమర్ ఇఫ్తికర్ అహ్మద్ ఒక్కటే 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లు అందరూ 6.4+ రన్ రేట్‌తో పరుగులు సమర్పించారు..
