IND VS AUS : ఆస్ట్రేలియాకు అదే బలం... తప్పుచేసారో భారీ మూల్యం : రోహిత్ సేనకు యువరాజ్ హెచ్చరిక
ఇప్పటివరకూ ప్రపంచ కప్ 2023 లో టీమిండియా అధ్భుతంగా ఆడింది... అందులో సందేహమే లేదు... మిగిలిన ఈ ఒక్క మ్యాచ్ లో ఒత్తిడిని జయించి విజయం సాధించాలని కోరుుకుంటున్నానని మాజీ క్రికెటర్ యువరాజ్ అన్నారు.
హైదరాబాద్ : యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 లో ఇప్పటివరకు ఓటమన్నదే ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా మూడోసారి ట్రోపీని ముద్దాడేందుకు అడుగుదూరంలో నిలిచింది. మరోసారి విశ్వవిజేతలుగా నిలిచే అరుదైన అవకాశం టీమిండియా ముందుంది. కానీ అది అంత ఈజీ కాదు... బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమైన పనే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఇలాగే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న యువరాజ్ ఆ అనుభవంతోనే రోహిత్ సేనకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాదు కీలక హెచ్చరిక చేసాడు.
ఆస్ట్రేలియా బలమైన జట్టే కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒత్తిడి లేకుండా ఆడుతుందని యువరాజ్ తెలిపారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఆసిస్ ఆటగాళ్లను బాగా తెలుసు... అందువల్లే జట్టు ఓటమిఅంచున వున్నా పోరాడిగెలిచిన సందర్భాలు అనేకం వున్నాయన్నారు. అంతేందుకు ఇదే ప్రపంచ కప్ 2023 ఆరంభంతో వరుస ఓటములు చవిచూసిన ఆసిస్ ఆ ఒత్తిడిని అధిగమించి మళ్లీ విజయాల బాట పట్టిందన్నారు. ఇలా సెమీ ఫైనల్ కు కూడా చేరడం కష్టమే అనుకున్న కంగారు జట్టు ఇప్పుడు ఫైనల్ కు చేరి టైటిల్ రేసులో నిలిచిందని యువరాజ్ సింగ్ తెలిపారు.
అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో ఓటమి అంచున నిలిచిన ఆసిస్ ను మ్యాక్స్ వెల్ గెలిపించిన తీరు ఆ టీం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుందని యువరాజ్ పేర్కొన్నారు. అలాగే సెమీ ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించిందన్నారు. ఇలా ఓడిపోతారనుకునే మ్యాచులను కూడా ఒంటిచేత్తో గెలిపించగల సత్తావున్న ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో వున్నారన్నారు. ప్రపంచ కప్ లాంటి పెద్దటోర్నీల్లో ఎక్కువ విజయాలు సాధించిన అనుభవం ఆసిస్ జట్టుకు వుంది... కాబట్టి ఇవాళ జరిగే ఫైనల్లో టీమిండియా జాగ్రత్తగా ఆడాలని యువరాజ్ సూచించారు.
Read More రోహిత్ శర్మ అంత ధైర్యంగా ఆడడానికి విరాట్ కోహ్లీయే కారణం... - ఆశీష్ నెహ్రా
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నివిభాగాల్లోనూ అద్భుతంగా వుందని యువరాజ్ తెలిపాడు. ఇలా మంచి ఫాంలో వున్న భారత జట్టు నేడు జరిగే ఫైనల్ లోనూ ఇదే ఆటతీరు కనబరుస్తుందని... విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. రోహిత్ సేన ఏ పొరపాట్లు చేయకుండా వుంటే ఆస్ట్రేలియా బలమైన ప్రత్యర్థే అయినప్పటికి చిత్తు చేయడం ఖాయమన్నారు.
ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లో టీమిండియాదే ఆదిపత్యం... ఇప్పటికే ఓసారి ఆస్ట్రేలియాను కూడా ఓడించిందని యువరాజ్ గుర్తుచేసారు. నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లోనూ టీమిండియాను ఎదుర్కోవడం ఆసిస్ కు కష్టమే... ఆటగాళ్లు అద్భుతంగా ఆడితేనే ఏ జట్టయినా గెలుస్తుందని మాజీ క్రికెటర్ యువరాజ్ తెలిపారు.