ఫైనల్‌లో టీమిండియా ‘అతి’ జాగ్రత్త... విరాట్ కోహ్లీ అవుట్! నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2023 వన్డే వరల్డ్ కప్‌లో 8వ సారి 50+ స్కోరు చేసి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... 54 పరుగులు చేసి అవుటైన విరాట్! భారత బ్యాటర్ల జిడ్డు బ్యాటింగ్.. 

ICC World cup 2023 Final: Virat Kohli goes after scoring record breaking half century, India vs Australia CRA

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తడబడుతోంది. యంగ్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కాగా రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లీ 54 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా..  

7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన  రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ పట్టిన సూపర్ క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. 

ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 పరుగులు చేయగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని అధిగమించేశాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. 63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 9వ సారి 50+ స్కోరు చేసి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హాఫ్ సెంచరీ తర్వాత ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ల పైకి ఆడుకుని అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ..

ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా రవీంద్ర జడేజాకి బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ 80 బంతులు ఆడినా ఒకే ఒక్క ఫోర్ బాదాడు. భారత బ్యాటర్లు అతి జాగ్రత్తగా వికెట్ పడకూడదని జిడ్డు బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు ముందుకు కదలడం లేదు.

33 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది టీమిండియా. ఇకనైనా కాస్త రిస్క్ తీసుకుని బౌండరీలు బాదకపోతే 280+ పరుగుల ఓ మోస్తరు స్కోరు చేయడం కూడా కష్టమైపోవచ్చు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios