ICC World cup 2023: అజ్మతుల్లా, హస్మతుల్లా హాఫ్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా ఆఫ్ఘాన్..
62 పరుగులు చేసి అవుటైన అజ్మతుల్లా ఓమర్‌జాయ్... హాఫ్ సెంచరీ చేసిన ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదటి మ్యాచ్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియాతో మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్, 35 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో వైడ్ రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన రెహ్మాత్ షా కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు..
63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. అజ్మతుల్లా ఓమర్‌జాయ్, ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ కలిసి నాలుగో వికెట్‌కి 128 బంతుల్లో 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.. 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు..
హస్మతుల్లా షాహిదీ 63 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు.