ICC World cup 2023: పాకిస్తాన్ పరువు పాయే! పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాక్...
పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం... వరుసగా మూడో పరాజయంతో పాకిస్తాన్ సెమీస్ ఛాన్స్‌లు సంక్లిష్టం..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని అందుకుంది. ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన పాక్, తాజాగా చెన్నైలో పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకుంది...
పాక్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ని ఓ ఆటాడుకున్న ఆఫ్ఘాన్ బ్యాటర్లు... 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కి ఇదే మొట్టమొదటి వన్డే విజయం. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్, సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కి 114 పరుగుల భాగస్వామ్యం జోడించిన ఇబ్రహీం జాద్రాన్, రెహ్మనుల్లా గుర్భాజ్.. నేటి మ్యాచ్‌లో 130 పరుగుల భారీ భాగస్వామ్యంతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు..
53 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇబ్రహీం జాద్రాన్, రెహ్మత్ షా కలిసి రెండో వికెట్‌కి 60 పరుగులు జోడించారు. 113 బంతుల్లో 10 ఫోర్లతో 87 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్... హసన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
అయితే రెహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 96 పరుగుల భాగస్వామ్యం జోడించి మ్యాచ్‌ని ముగించారు.. 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసిన రెహ్మాత్ షా, 45 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేసిన హస్ముతల్లా షాహిదీ... పాక్‌కి ఊహించని షాక్ ఇచ్చారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 17 పరుగులు, అబ్దుల్లా షెఫీక్ 58 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 8, సౌద్ షకీల్ 25 పరుగులు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 74 పరుగులు చేశారు. ఆఖర్లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్, 38 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన షాదబ్ ఖాన్ చివరి ఓవర్‌లో అవుట్ అయ్యారు...