మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి ఏంటి..? మెగా ఈవెంట్లో మన అమ్మాయిలు హిట్టా..? ఫట్టా..?
Women's T20 World Cup 2023: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. గత టోర్నీలో రన్నరప్ గా నిలిచిన మన అమ్మాయిలు ఈసారైనా కప్ కొడతారా..?

అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో అగ్రశ్రేణి జట్లుగా వెలుగొందుతున్న మూడు, నాలుగు టీమ్ లలో టీమిండియా కూడా ఒకటి. పురుషుల క్రికెట్ లో మాదిరిగానే మన అమ్మాయిలు కూడా దూసుకుపోతున్నారు. గడిచిన ఐదారేండ్లలో భారత మహిళల క్రికెట్ లో అనూహ్య మార్పులు వచ్చాయి. కొత్త క్రికెటర్లు జట్టులోకి వచ్చి తమ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. అయితే ద్వైపాక్షిక సిరీస్ లలో రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. మెగా ఈవెంట్ లలో మాత్రం ఢీలా పడుతున్నది. ఐసీసీ ఈవెంట్లలో తడబడుతున్నది. మొన్న దక్షిణాఫ్రికాలో ముగిసిన అండర్ - 19 వరల్డ్ కప్ భారత మహిళల క్రికెట్ జట్టు (అన్ని ఫార్మాట్లలో)కు తొలి ట్రోఫీ కావడం గమనార్హం.
2009 నుంచి ఐసీసీ.. ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ను నిర్వహిస్తున్నది. టోర్నీ ప్రారంభం నుంచీ ఆడుతున్నా భారత్ ఇదివరకు అత్యుత్తమ ప్రదర్శన చేసింది 2020 లోనే. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో టీమిండియా రన్నరప్ గా నిలిచింది.
తొలి ఎడిషన్ నుంచి..
- ఐసీసీ మహిళల ప్రపంచకప్ తొలి ఎడిషన్ (2009) లోనే భారత్ ఎంట్రీ ఇచ్చింది. 2016లో ఇండియాలోనే ఈ టోర్నీ జరిగినా విఫలమైంది.
- 2009, 2010లో భారత జట్టు సెమీస్ వరకు వెళ్లగలిగింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు ఎడిషన్లు (2012, 2014, 2016) తొలి రౌండ్ కే పరిమితమైంది.
- 2018లో టీమిండియా.. సెమీస్ వరకు వెళ్లింది.
- 2020లో టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన టీమిండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నపర్ గా నిలిచింది.
- మొత్తంగా ఈ టోర్నీలో భారత అమ్మాయిలు.. 31 మ్యాచ్ లు ఆడి 17 గెలిచి 14 మ్యాచ్ లలో ఓడారు.
ఇప్పుడు..?
- గతంతో పోల్చితే టీమిండియా మెరుగుపడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా లతో పాటు ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో రాజేశ్వరి గైక్వాడ్ తో పాటు యువ సంచలనం రేణుకా ఠాకూర్ లు కొత్తబంతితో నిప్పులు చెరుగుతున్నారు.
- ఇటీవలే షెఫాలీ వర్మ సారథ్యంలోని అండర్ - 19 భారత జట్టు టోర్నీ గెలవడం హర్మన్ ప్రీత్ సేనకు బూస్ట్ ఇచ్చేదే. అదీగాక ఆ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించిన షెఫాలీ.. సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది.
ప్రపంచకప్ కు భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, అంజలి సర్వని, పూజా వస్త్రాకార్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే
రిజర్వ్ ప్లేయర్లు : సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్
భారత్ షెడ్యూల్ :
ఈ టోర్నీలో గ్రూప్ - బిలో ఉన్న భారత్.. తొలి మ్యాచ్ ను దాయాది దేశంతోనే ఆడనున్నది. ఫిబ్రవరి 12న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ తో భారత్ టోర్నీ వేట మొదలెట్టనుంది.
- ఫిబ్రవరి 15 ఇండియా వర్సెస్ వెస్టిండీస్
- ఫిబ్రవరి 18 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
- ఫిబ్రవరి 20 ఇండియా వర్సెస్ ఐర్లాండ్
- గ్రూప్ లో ఒక్క ఇంగ్లాండ్ తో తప్పితే పాకిస్తాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ తో గెలవడం భారత్ కు పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే హర్మన్ ప్రీత్ అండ్ కో. ఈజీగా సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎలా ఆడుతుందన్నది త్వరలోనే తేలనుంది.