ICC Under-19 World Cup 2022: 24 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్  అద్భుతం చేసింది. తొలిసారి జూనియర్ వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగిడింది. విజయం కోసం ఆఫ్ఘాన్ చివరివరకు పోరాడినా....

వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో పసికూన ఆఫ్ఘానిస్థాన్.. పటిష్ట ఇంగ్లాండ్ ను భయపెట్టింది. మంగళవారం అంటిగ్వా లోని సర్ వివిన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ సెమీస్ లో ఆఫ్ఘాన్ జట్టు.. ఇంగ్లాండ్ పై పోరాడి ఓడింది. వర్షం వల్ల 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా.. చివర్లో నిలకడ లేమి కారణంగా విజయం ఇంగ్లాండ్ ను వరించింది. ఆఖరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లాండ్.. 15 పరుగుల (డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఇంగ్లాండ్.. 24 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూనియర్ ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్ కు చేరింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రమాదకర ఓపెనర్ బెతెల్ (2) ను ఆఫ్ఘాన్ బౌలర్ జద్రాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ టామ్ ప్రెస్ట్ తో కలిసి జార్జ్ థామస్ (50) స్కోరు బోర్డును నడిపించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 48 పరుగులు జోడించారు. కానీ ప్రెస్ట్ ను ఖారోట్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు జేమ్స్ రా (12), విల్ లక్స్టన్ (11) పెద్దగా ఆకట్టుకోలేదు. 

దీంతో ఇంగ్లాండ్ 23.4 ఓవర్లలో 106 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో జార్జ్ బెల్ (56), వికెట్ కీపర్ అలెక్స్ హర్టన్ (53) లు ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. ఈ ఇద్దరి హాఫ్ సెంచరీల ఫలితంగా ఇంగ్లాండ్.. నిర్ణీత 47 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో జద్రాన్, నూర్ అహ్మద్ లు తలో రెండు వికెట్లు తీశారు. 

Scroll to load tweet…

లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా ఆఫ్ఘాన్ కు శుభారంభమేమీ దక్కలేదు. ఓపెనర్ ఖారోట్ (0) డకౌట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ మహ్మద్ ఇషాక్ (43) తో కలిసి అల్లా నూర్ (60) లు రెండో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే ఇషాక్ రనౌట్ కావడంతో ఆఫ్ఘాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆఫ్ఘానిస్థాన్ జట్టు క్రమం తప్పకుండా మూడు వికెట్లను కోల్పోయింది. 28.1 ఓవర్లలో ఆఫ్ఘాన్ 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 

ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభిస్తున్న వేళ ఆఫ్ఘాన్ మిడిలార్డర్ బ్యాటర్లు అబ్దుల్ హది (37 నాటౌట్) బిలాల్ అహ్మద్ (33) ఆదుకున్నారు. కానీ ఇన్నింగ్స్ 37.4 ఓవర్ లో అహ్మద్ ను టామ్ ప్రెస్ట్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇజాజ్ అహ్మద్ (4) కూడా త్వరగానే నిష్క్రమించాడు. అయితే ఆ వెంటనే వచ్చిన నూర్ అహ్మద్ (25) కాసేపు ప్రతిఘటించాడు. కానీ 45.1 ఓవర్లో అతడు కూడా ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిప నవీద్ (0), సమి (0) లు డకౌట్ అయ్యారు. హది చివరివరకు క్రీజులో నిలిచినా అతడికి సహకారం అందించేవాళ్లు లేకపోవడంతో ఆఫ్ఘాన్ కు ఓటమి తప్పలేదు. 47 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆఫ్ఘానిస్థాన్ 9 వికెట్టు నష్టపోయి 215 పరుగులు మాత్రమే చేసింది. 

ఇంగ్లాండ్ ఆటగాడు జార్జ్ బెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన ఇంగ్లాండ్.. నేడు ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగే రెండో సెమీస్ లో గెలిచిన విజేతతో తుది పోరులో తలపడుతుంది. ఫైనల్ శనివారం ఇదే స్టేడియంలో జరుగనుంది.