దుబాయ్: టీ20 ఐసిసి ర్యాంకింగ్ లో భారత బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. న్యూజిలాండ్ పై జరిగిన సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకాడు. 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో అతను నాలుగు స్థానాలు ఎకబాకాడు. తద్వారా 823 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుని కేరీర్ ఉత్తమ ర్యాంక్ ను సాధించాడు. 

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిదో స్థానంలో, రోహిత్ శర్మ పదో స్థానంలో నిలిచారు. ఇదే సిరీస్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ 55వ స్థానంలో, మనీష్ పాండే 58 స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో పాకిస్తాన్ టీ20 కెప్టెన్ బాబర్ ఆజం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  టాప్ టెన్ లో ముగ్గురు భారత బ్యాట్స్ మెన్ కు స్థానం దక్కింది.

బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా 11వ స్థానంలో నిలువగా, చాహల్ 30వ స్థానంలో నిలిచారు. శార్దూల్ ఠకూర్ 57 స్థానంలో, నవదీప్ సైనీ 71వ స్థానంలో, రవీంద్ర జడేజా 76వ స్థానంలో నిలిచారు.