ICC T20 WC: టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసేది ఆ రోజే.. కొత్త డ్రెస్ ఎలా ఉంటుందంటే..
Team India New Jersey: వారం రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. యూఏఈలోనే ఉన్న భారత జట్టు ఆటగాళ్లకు IPL రూపంలో మంచి ప్రాక్టీస్ లభిస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త జెర్సీని కూడా విడుదల చేయనున్నది.
ఈ నెల 17 నుంచి యూఏఈ వేదికగా మొదలుకానున్న ICC T20 WORLD CUP కోసం అన్ని జట్లు సర్వసన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్ నిమిత్తం యూఏఈలోనే ఉన్న భారత జట్టు ఆటగాళ్లకు.. ఈ మెగా టోర్నీకి ముందు మంచి ప్రాక్టీస్ కూడా లభిస్తున్నది. ఇదిలాఉండగా ఈనెల 13న virat kohli నేతృత్వంలోని భారత జట్టు కొత్త జెర్సీని రివీల్ చేయబోతున్నది.
ఈ విషయాన్ని BCCI అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘మనమంతా ఎదురుచూస్తున్న క్షణం. అక్టోబర్ 13న భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేయబోతున్నాం. దీనిని చూడటానికి మీరు ఉత్సాహంగా ఉన్నారా..?’అని ట్వీట్ చేసింది.
ఈ జెర్సీకి mpl sports అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నది. 2023 డిసెంబర్ వరకు ఎంపీఎల్ స్పోర్ట్స్ పేరున్న jerseyలే భారత జట్టు వేసుకోనుంది. అక్టోబర్ 13న జెర్సీ రివీల్ చేసే రోజు ఆటగాళ్లంతా కొత్త జెర్సీని వేసుకుంటారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: IPL 2021: కోట్లు పోసి కొన్నా ఏం లాభం! కొన్నది 16 కోట్లకు.. తీసింది 15 వికెట్లు.. ఇక క్రిస్ మోరిస్ కథ కంచికే..
కాగా.. చాలా ఏండ్లుగా భారత్ లైట్ బ్లూ కలర్ తో ఉండే జెర్సీనే ధరించేది. కానీ గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జెర్సీని డార్క్ బ్లూ గా మార్చారు. కానీ కొత్త జెర్సీ భారత జట్టు 1992 ప్రపంచకప్ సందర్భంగా ఉపయోగించిన దానిలా ఉంటుందని తెలుస్తున్నది. బ్లూ, గ్రీన్, వైట్, రెడ్ కలర్ ల మిక్స్డ్ గా జెర్సీ ఉండనుందని ఎంపీఎల్ స్పోర్ట్స్ ప్రతినిధి చెప్పారు. అయితే కొత్త జెర్సీ ఎలా ఉండబోతుందో చూడాలని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
టీ20 టోర్నీలో భాగంగా భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అక్టోబర్ 24న జరిగే పోరుతో ప్రారంభించనుంది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మా జట్టు గెలుస్తుందంటే మా జట్టే గెలుస్తుందని ఇరు దేశాలకు చెందిన సీనియర్ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.