Scotland vs Namibia: టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుని.. స్కాట్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
పొట్టి ప్రపంచకప్ (T20 worldcup) లో భాగంగా క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా సూపర్-12 కు అర్హత సాధించిన నమీబియా (Namibia).. స్కాట్లాండ్ (Scotland) నేడు అబుదాబిలో తలపడుతున్నాయి. సోమవారం అఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దారుణ ఓటమి పాలైన స్కాట్లాండ్ కు ఇది రెండో మ్యాచ్ కాగా.. నమీబియాకు ఇదే తొలి మ్యాచ్. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుని.. స్కాట్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కాగా.. స్కాట్లాండ్ కెప్టెన్ కొయెట్జర్ వేలి గాయంతో ఈ మ్యాచ్ కు దూరంగా ఉండగా.. రిచీ బెర్రింగ్టన్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ కు నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్మన్ (Ruben trumpelmenn) చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే మొదటి బంతిని ఓపెనర్ మున్సీ (0) ఔట్ చేసిన అతడు.. తర్వాత రెండు బంతులు వైడ్ లు విసిరాడు. మూడో బంతికి మాక్లియోడ్ (0), నాలుగో బంతికి కెప్టెన్ బెర్రింగ్టన్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆ జట్టు స్కోరు బోర్దుపై పరుగులేమీ చేయకుండానే (రెండు వైడ్ల ద్వారా వచ్చిన పరుగులు మాత్రమే) మూడు వికెట్లు కోల్పోయింది.
ఐదు ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ స్కోరు 16-3. ఆరో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన డేవిడ్ వీస్.. క్రెయిగ్ వాల్లెస్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్.. మొన్నటి మ్యాచ్ లో మాదిరే 60 లోపే ఆలౌట్ అవుతుందా..? అని అనిపించింది.
కానీ ఓపెనర్ మాథ్యూ క్రాస్ (33 బంతుల్లో 19), మైకేల్ లీస్క్ (27 బంతుల్లో 44.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్కాట్లాండ్ ను ఆదుకున్నారు. వీరి కృషితోనే ఆ జట్టు 100 పరుగులు దాటగలిగింది. క్రాస్ ఔటయ్యాక వచ్చిన క్రిస్ గ్రీవ్స్ కూడా (25) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ కెరీర్ ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన అతడు.. నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులే ఇచ్చాడు. మరో బౌలర్ ఫ్రైలింక్ (4-0-10-2) పొదుపుగా బౌలింగ్ చేశాడు. స్మిత్, డేవిడ్ వీస్ కు చెరో వికెట్ దక్కాయి.
