Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: దంచికొట్టిన దక్షిణాఫ్రికా.. సఫారీల సెమీస్ ఆశలు సజీవం..

SA Vs BAN: టాస్ గెలిచి బంగ్లాను 84 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆ జట్టు తొలుత కాస్త తడబడింది.

ICC T20 World cup 2021: South Africa beat Bangladesh by 6 wickets
Author
Hyderabad, First Published Nov 2, 2021, 6:48 PM IST

టీ 20  ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ముందుగా బంతితో బంగ్లాను కట్టడి  చేసిన సఫారీలు.. తర్వాత బ్యాటింగ్ లోనూ విజృంభించారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 85 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు.  14.3  ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి  గెలుపును అందుకున్నారు. తాజా గెలుపుతో గ్రూప్-1 లో సెమీస్  బెర్త్ కు దక్షిణాఫ్రికా మరింత దగ్గరైంది. 

టాస్ గెలిచి బంగ్లాను 84 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆ జట్టు తొలుత కాస్త తడబడింది. తొలి ఓవర్లోనే టస్కిన్ అహ్మద్.. హెండ్రిక్స్ (4)  ను ఔట్ చేసి బంగ్లాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. 

 

నాలుగో ఓవర్ వేసిన మెహదీ హసన్  బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన మరో ఓపెనర్ డికాక్ (15 బంతుల్లో 16.. 3 ఫోర్లు)  ఆ ఓవర్లో ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మర్క్రమ్ (0) ను కూడా ఆరో ఓవర్లో టస్కిన్ ఔట్ చేశాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులే చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్.. మ్యాచ్ పై పట్టు బిగించేలా కనిపించింది. 

కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (28 బంతుల్లో 31 నాటౌట్.. 3 ఫోర్లు, 1 సిక్సర్).. వాన్డర్ డసెన్ (27 బంతుల్లో 22)  సఫారీల విజయాన్ని ఖరారు చేశాడు. ఇద్దరూ కలిసి బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కనప్పుడల్లా ఫోర్లు కొడుతూ లక్ష్యం దిశగా నడిచారు.  నసుమ్ అహ్మద్ వేసిన 13 వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన డసెన్..  ఆ తర్వాత బంతికి షోరిఫుల్ ఇస్లాం కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ అప్పటికే సఫారీల విజయం ఖరారైంది.  మిల్లర్ (5 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశాడు. సూపర్-12 లో దక్షిణాఫ్రికాకు ఇది మూడో విజయం. 

 

బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4 ఓవర్లు వేసిన 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. షోరిఫుల్ ఇస్లాం కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ  లక్ష్యం తక్కువగా ఉండటంతో బంగ్లా బౌలర్లకు పోరాడే ఛాన్స్ దక్కలేదు. కాగా.. బంతితో బంగ్లా వెన్ను విరిచిన  సఫారీ బౌలర్ కగిసొ రబాడ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఓడిన తర్వాత సఫారీలు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచారు. మొత్తంగా గత 11 టీ20 మ్యాచ్ లలో వాళ్లకు ఇది పదో విజయం కావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios