Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: నెమ్మదిగా మొదలెట్టి ఆఖర్లో చెలరేగిన బాబర్, రిజ్వాన్.. నమీబియా ముందు భారీ లక్ష్యం

Pakistan vs Namibia: నమీబియా బౌలర్లపై  పాకిస్థాన్ బ్యాటర్లు  ఎదురుదాడికి దిగారు. పాక్ ను తొలుత కట్టడి చేసిన నమీబియా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

ICC T20 World cup 2021: Skipper Babar Azam and rizwan on fire, Pakistan Scores 189 against Namibia
Author
Hyderabad, First Published Nov 2, 2021, 9:24 PM IST

వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup) సెమీస్ దిశగా దూసుకెళ్తున్న పాకిస్థాన్ (Pakistan) జట్టు.. ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. అబుదాబి వేదికగా జరుగుతున్న  గ్రూప్-2 మ్యాచ్ లో ఆ జట్టు పసికూన నమీబియా (Namibia) బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలుత కట్టడి చేసిన నమీబియా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.  ఆ జట్టు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) మరోసారి చెలరేగారు. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ను నమీబియా ధీటుగా అడ్డుకుంది. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు బౌలింగ్ చూస్తే వీళ్లు పసికూనలా..? అనిపించేంత స్థాయిలో ఆ బౌలర్లు  బంతులేశారు. ముఖ్యంగా తొలి ఓవర్ వేసిన ట్రంపుల్మాన్ (Ruben Trumplemann).. మెయిడిన్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన డేవిడ్ వీస్ కూడా నాలుగు పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన ట్రంపుల్మాన్.. మరోసారి కట్టుదిట్టంగా బంతులేశాడు. ఈ ఓవర్లో కూడా రెండు పరుగులే వచ్చాయి. నాలుగో ఓవర్లో తొలి ఫోర్ కొట్టింది.  4 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోరు వికెట్ నష్టపోకుండా 13 పరుగులే. 

అప్పటిదాకా ఆచితూచి ఆడిన పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 70.. 7 ఫోర్లు) తొమ్మిదో ఓవర్ తర్వాత గేర్ మార్చాడు. తన శైలికి తగ్గట్టుగానే.. ముందు నెమ్మదిగా ఆడటం  తర్వాత విజృంభించడాన్ని కొనసాగించాడు. కుదురుకునేదాకా సింగిల్స్, డబుల్స్ కు ప్రాధాన్యం ఇచ్చిన బాబర్..  లొఫ్టి వేసిన 9 వ ఓవర్లో  ఫోర్ కొట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 59 పరుగులు. 

పదకొండో ఓవర్లో ఫోర్ తో హాఫ్ సెంచరీకి దగ్గరైన బాబర్..   ట్రంపుల్మాన్ వేసిన  తర్వాత ఓవర్లో రెండు పరుగులు తీసి అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అదే ఓవర్లో మరో ఫోర్ కొట్టాడు.  అప్పటిదాకా క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడ్డ రిజ్వాన్ (50 బంతుల్లో 79 .. 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ట్రంపుల్మాన్ ఓవర్లోనే సిక్సర్, ఫోర్ కొట్టి జోరు పెంచాడు. 

70 పరుగులు చేసి  ఊపు మీదున్న బాబర్ ను 15 వ ఓవర్లో వీస్ ఔట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన బాబర్.. ఆ తర్వాత బంతికి ఫ్రిలింక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరితాడు. దీంతో 113 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  పాక్ కెప్టెన్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.  ఫ్రిలింక్ బౌలింగ్ లో  జేన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు.

ఫకర్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన హఫీజ్ (16 బంతుల్లో 32 ... 5 ఫోర్లు) వరుస ఫోర్లతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన అతడు.. 17 వ ఓవర్లో వరుసగా రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. ఆ తర్వాత ట్రంపుల్మాన్ ఓవర్లో కూడా  తొలి రెండు బంతులను బౌండరీ దాటించాడు.  అదే ఓవర్లో  చివరి బంతికి  రిజ్వాన్ ఫోర్ బాదడంతో మొత్తం 17 పరుగులొచ్చాయి. 

వీస్ వేసిన 18వ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లో సిక్స్ కొట్టి రిజ్వాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్లో రిజ్వాన్ శివతాండవం ఆడాడు. స్మిట్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టిన రిజ్వాన్.. తర్వాత వరుసగా 6, 4, 4, 4, 2 పరుగులొచ్చాయి. మొత్తంగా ఆ ఓవర్లో 24 పరుగులొచ్చాయి. ఆఖరి 4 ఓవర్లలో పాక్.. 61 పరుగులు చేసింది. ఇక తొలి 10 ఓవర్లలో 59 పరుగుల చేసిన పాక్.. ఆఖరి పది ఓవర్లలో 130 పరుగులు చేయడం విశేషం.   

నమీబియా తొలి 5 ఓవర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినా తర్వాత  గతి తప్పింది. తొలి ఓవర్ మెయిడిన్ వేసిన ట్రంపుల్మాన్.. ఆఖర్లో తేలిపోయాడు. వీస్, స్మిట్, ప్రిలింక్ ప్రభావం చూపలేకపోయారు. వీస్ కు ఒక వికెట్ దక్కగా.. ఫ్రిలింక్ కు మరో వికెట్ పడగొట్టాడు.  రిజ్వాన్ దెబ్బకు స్మిట్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతడు.. 50 పరుగులిచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios