Pakistan Vs Namibia: టీ20 వరల్డ్ కప్ లో వరుసగా నాలుగో విజయంతో పాకిస్థాన్ ప్రపంచకప్ సెమీస్ కు దూసుకెళ్లింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో  పాకిస్థాన్.. నమీబియా ను చిత్తు  చేసింది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో పాకిస్థాన్ (Pakistan) తొలి అంచెను విజయవంతంగా దాటింది. వరుసగా నాలుగో విజయంతో ఆ జట్టు ప్రపంచకప్ సెమీస్ (T20 World cup semifinals) కు దూసుకెళ్లింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్.. నమీబియా (Namibia)ను చిత్తు చేసింది. 190 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆ జట్టు 45 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో ఇరగదీసిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 190 పరుగుల ఛేదనలో నమీబియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే హసన్ అలీ.. ఓపెనర్ లింగెన్ (4) ను బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన క్రెయిగ్ విలియమ్స్ (37 బంతుల్లో 40.. 5 ఫోర్లు, 1 సిక్సర్).. మరో ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (29 బంతుల్లో 29) కాస్త ప్రతిఘటించాడు. 

ఇద్దరూ కలిసి పాక్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ముఖ్యంగా విలియమ్స్ అయితే బెదురు లేకుండా ఆడాడు. హసన్ అలీ, షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడి చూడముచ్చటైన షాట్లు ఆడాడు. మరోవైపు బార్డ్.. తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత పుంజుకున్నాడు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు.. ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. 

Scroll to load tweet…

ఈ క్రమంలో అనవసరమైన పరుగుకు ప్రయత్నించిన బార్డ్.. రనౌట్ అయ్యాడు. బార్డ్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎరాస్మస్.. (10 బంతుల్లో 15.. ఒక ఫోర్, ఒక సిక్సర్) వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి ఊపుమీదే కనిపించినా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. షాదాబ్ ఖాన్ వేసిన పదో ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి 13 వ ఓవర్లో ఇమాద్ వసీం బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

Scroll to load tweet…

ఇక క్రీజులో కుదురుకుంటున్న విలియమ్స్ ను షాదాబ్ ఔట్ చేశాడు. 14ఓవర్లు ముగిసేసరికి నమీబియా స్కోరు 93-4 గాఉంది. విలియమ్స్ ఔటయ్యాక వచ్చిన డేవిడ్ వీస్ (30 బంతుల్లో 43.. 3 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆఖర్లో మెరపులు మెరిపించినా అవి నమీబియా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి తప్ప గెలపును అందించలేదు. ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్ లో.. అతడు రెండు ఫోర్లు, సిక్సర్ తో కలిపి 16 పరుగులు రాబట్టడం విశేషం.

పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, హరిస్ రవుఫ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. అఫ్రిదికి ఒక్క వికెట్ దక్కకపోగా.. 4 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చుకున్నాడు. ఈ గెలుపుతో పాకిస్థాన్.. ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టు అయింది. నమీబియాకు ఇది రెండో పరాజయం.