Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: ఐపీఎల్ మాకు మంచే చేసింది.. దానివల్లే మా బౌలర్లు రాటుదేలారు: కివీస్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Newzealand vs scotland:ఐపీఎల్ లో ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న పలువురు బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఆడారు. ట్రెంట్ బౌల్ట్.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడగా ఫెర్గూసన్, టిమ్ సౌథీ కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడారు.

ICC T20 world cup 2021: IPL helped as a bowling group, says Newzealand Bowler Tim southee
Author
Hyderabad, First Published Nov 3, 2021, 11:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 ప్రపంచకప్ (T20 World cup)లో హాట్ ఫేవరేట్ గా అడుగిడి ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమణ బాట పట్టిన టీమిండియా (Team India) ఆటతీరుకు ఇండియన్ ప్రీమియర్ లీగే (IPL) కారణమని పలువురు విమర్శిస్తుండగా న్యూజిలాండ్ (Newzealand)స్టార్ పేసర్ మాత్రం అందుకు భిన్నంగా  వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ వల్ల తమకు లాభం కలిగిందని, ఈ లీగ్ కారణంగానే తాము ఈ టోర్నీలో బాగా రాణించగలుగుతున్నామని అతడు చెప్పడం గమనార్హం. 

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు గ్రూప్-బి లో ఉన్న న్యూజిలాండ్ జట్టు  మధ్యాహ్నాం 3.30 గంటలకు స్కాట్లాండ్ (Scotland) తో తలపడనున్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టు  స్టార్  పేసర్ టిమ్ సౌథీ (Tim Southee) మాట్లాడాడు. ‘మా జట్టు నుంచి చాలా మంది యూఏఈలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రెండో అంచెలో ఆడారు. ఇది మా బౌలర్లకు ఎంతో లాభం చేసింది. ఐపీఎల్ వల్ల ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని.. ఈ ఫిచ్ ల మీద ఎలా ఆడాలనేది అవగాహన వచ్చింది’ అని అన్నాడు. 

ఐపీఎల్ లో ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న పలువురు బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఆడారు. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult).. ముంబై ఇండియన్స్ తరఫున ఆడగా ఫెర్గూసన్, టిమ్ సౌథీ కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడారు. ఇక కేన్ విలియమ్సన్ (Kane williamson) సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. 

ఇదిలాఉండగా.. ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు పరాజయం పాలైన తర్వాత భారత క్రికెట్ అభిమానులు ఐపీఎల్ పై దుమ్మెత్తి పోశారు. ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కు కారణం ఐపీఎల్ అని.. ఆ లీగ్ ను నిషేధించాలని సోషల్ మీడియాలో ఉద్యమాలు చేశారు. అసలు ఒక్క శాతం ఫిట్నెస్, టెక్నిక్, అంకితబావం లేని ఆటగాళ్లను తీసుకొచ్చి భారత జట్టుకు ఆడించడం సమంజసం కాదని విమర్శలు సంధిస్తున్నారు.  ఐపీఎల్ లో రెండు, మూడు మ్యాచ్ లలో మెరవగానే వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం వల్లే  ప్రస్తుతం టీమిండియా పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని ఆరోపిస్తున్నారు. కానీ సౌథీ మాత్రం దీనికి భిన్నంగా స్పందించడం విశేషం. 

కాగా.. ప్రపంచకప్ లో పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన తమ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన న్యూజిలాండ్ తర్వాత మ్యాచ్ లో పుంజుకుంది. భారత్ ను బౌలింగ్ తో నిలువరించి..  బ్యాటింగ్ తో చుక్కలు చూపించింది. టీమిండియాపై 8 వికెట్ల  తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆ జట్టు నేడు స్కాట్లాండ్ తో తలపడనున్నది. 

అయితే.. పాక్ తో మ్యాచ్ తర్వాత తమ తప్పులు తెలుసుకున్నామని సౌథీ అన్నాడు. ఆ మ్యాచ్ లో చేసిన తప్పిదాలపై సమీక్ష నిర్వహించుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడ్డామని తెలిపాడు. ఆ తప్పులను టీమిండియాపై చేయకుండా.. ఆ జట్టును ఓడించామని అన్నాడు. భారత్ లాంటి బలమైన జట్టును.. అందరం కలిసికట్టుగా ఆడి ఓడించడం గొప్ప అనుభూతి అని సౌథీ చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios