Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: కష్టమే..! కానీ ఏమో, గుర్రం ఎగురావచ్చు.. టీమిండియా సెమీస్ కు ఇలా వెళ్లొచ్చు..!!

Team India SemiFinal Race:టీ20 ప్రపంచకప్ లో  హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగి.. కప్పు గ్యారంటీగా కొడ్తారు అనుకున్న చోట.. దారుణంగా చతికిలపడ్డారు మన 11 మంది యోధులు. ఇప్పుడు కప్పు కాదు కదా..  కనీసం సెమీస్ బెర్త్ అయినా కన్ఫర్మ్ అయితే చాలు.. అనే స్థితికి వచ్చింది పరిస్థితి.

ICC T20 World cup 2021: India still have semifinals chance, check all the possible scenarios here
Author
Hyderabad, First Published Nov 4, 2021, 1:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..’ తెలుగులో ఓ నాటు సామెత ఇది. టీమిండియా (Team India)కు ఇప్పుడు ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021) లో  హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగి.. కప్పు గ్యారంటీగా కొడ్తారు అనుకున్న చోట.. దారుణంగా చతికిలపడ్డారు మన 11 మంది యోధులు. ఇప్పుడు కప్పు కాదు కదా..  కనీసం సెమీస్ (T20 Semifinals Race) బెర్త్ అయినా కన్ఫర్మ్ అయితే చాలు.. అనే స్థితికి వచ్చింది భారత క్రికెట్ అభిమానుల పరిస్థితి. ప్రాక్టికల్ గా చూస్తే టీమిండియాకు ఆ అవకాశమైతే లేదు. కానీ కొన్ని లెక్కలేసుకుంటే మాత్రం మనకూ ఆ ఛాన్సుంది.

గత నెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)తో,  మరో వారం రోజుల తర్వాత న్యూజిలాండ్ (Newzealand)తో పేలవ ఆటతీరు కారణంగా రెండు మ్యాచులు ఓడిపోయిన టీమిండియా.. నిన్న అబుదాబిలో అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరిగిన పోరులో విజయదుందుభి మోగించింది.  కీలక సమయంలో బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించి సెమీస్ ఆశలు అడుగంటకుండా కాపాడుకుంది. ఇక ఇప్పుడు భారత్ సెమీస్ (India Semifinals Chances) చేరాలంటే.. 

గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. గ్రూప్-2లో ఆ పని పాకిస్థాన్ చేసింది. ఆడిన  4 మ్యాచుల్లో గెలిచి సెమీస్ దూసుకెళ్లింది. గ్రూప్-1 విషయం కాస్త పక్కనబెడితే.. గ్రూప్-2లో మనతో పాటు సెమీస్ రేసులో ఉన్న జట్లు న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్.. 

- India.. తర్వాత జరిగే  స్కాట్లాండ్, నమీబియాతో  భారీతేడాతో నెగ్గాలి. అప్పుడు మన రన్ రేట్ మెరుగవుతుంది. ఇప్పటికైతే నిన్నటి మ్యాచ్ అనంతరం టీమిండియా రన్ రేట్ కాస్త మెరుగైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో  నాలుగో స్థానంలో ఉన్న భారత్ రన్ రేట్ +0.073. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు +.0.816 .. రెండో స్థానంలో ఉన్న అఫ్గాన్.. +1.481 గా ఉన్నాయి. 

- స్కాట్లాండ్, నమీబియాతో భారత్ గెలిస్తే సరిపోదు.. అఫ్గనిస్థాన్ తో ఈనెల 7 న జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ప్రస్తుత కివీస్ ఫామ్ చూస్తే ఇది అసాధ్యం కాకపోవచ్చు కానీ తనదైన రోజున ఎంత పెద్ద జట్టుకైనా షాకిచ్చే సత్తా అఫ్గాన్ కు ఉంది. మనమూ (ఇండియన్ ఫ్యాన్స్) ఇప్పుడు ఇదే కోరుకోవాలి. అంతకుమించి మనకు మరో ఆప్షన్ కూడా లేదు మరి. కివీస్ ఓడిపోతే మాత్రం మనకు పండుగే. 

- న్యూజిలాండ్.. అఫ్గాన్ తో ఓడి నమీబియా మీద గెలిస్తే అప్పుడు ఆ జట్టుకు 6 పాయింట్లు దక్కుతాయి. ఇక విరాట్ సేన.. తదుపరి రెండు మ్యాచ్ లలో గెలిస్తే కూడా అన్నే పాయింట్లుంటాయి. అఫ్గాన్ కు  కూడా అదే స్థాయిలో ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఆ సందర్భంలో భారత్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే మనకు సెమీస్ అవకాశాలుంటాయి. 

- ఒకవేళ న్యూజిలాండ్.. అఫ్గాన్, నమీబియామీద గెలిస్తే ఈ లెక్కలు, సమీకరణాలు గోల లేకుండా డైరెక్ట్ గా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఇక అప్పుడు నవంబర్ 8న నమీబియాతో మ్యాచ్ ముగిశాక టీమిండియా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడమే..! 

వాస్తవికంగా చూస్తే ఇదంతా కొద్దిగా ఆశ్చర్యకరంగా, మరికొంత గందరగోళంగా  అనిపించినా.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు.. ఎందుకంటే అదేదో సినిమాలో చెప్పినట్టు.. మనదేశంలో లాజిక్కుల కంటే మ్యాజిక్కులకే ఎక్కవ గుర్తింపు కదా. ఇప్పటికైతే మనమూ అదే కోరుకుందాం.. 

Follow Us:
Download App:
  • android
  • ios