Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: అఫ్గాన్ ఏం చేస్తుందో..? కివీస్ తో నేడు కీలక పోరు.. నబీ సేన ఓడితే టీమిండియా ఇంటికే..

New Zealand Vs Afghanistan: ఈ మ్యాచ్  న్యూజిలాండ్.. అఫ్గానిస్థాన్ లకే కాదు.. 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని  టీమిండియాకూ కీలకమే.  ఈ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాగ్ సర్దుకోవడమే.. 

ICC T20 World cup 2021: India Hopes on Afghanistan surprise victory against New Zealand match Today
Author
Hyderabad, First Published Nov 7, 2021, 12:15 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-2 లో నేడు సెమీస్ చేరేదెవరనే విషయంపై స్పష్టత రానుంది. ఆదివారం మధ్యాహ్నం అబుదాబి వేదికగా  అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ కీలక పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తేనే రెండు జట్లకు సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఓడిన జట్టు సెమీస్ రేసు నుంచే కాదు.. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. అయితే ఈ మ్యాచ్  న్యూజిలాండ్.. అఫ్గానిస్థాన్ లకే కాదు.. 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని  టీమిండియాకూ కీలకమే.  ఈ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే శంకరగిరి మాన్యాలే.. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రవీంద్ర జడేజా చెప్పినట్టు.. బ్యాగ్ ప్యాక్  చేసుకుని ఢిల్లీ విమానమెక్కడమే.

గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి.  సెమీస్ రేసులో ఉన్న దక్షిణాఫ్రికా ఆశలపై నెట్ రన్ రేట్ నీళ్లు చల్లింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ గెలిచినా ఆ జట్టును ఎప్పటిలాగే దురదృష్టం వెంటాడింది. ఇంగ్లాండ్ ను ఓడించి ఆసీస్ తో సమానంగా నిలిచినా..  సౌతాఫ్రికా కంటే ఆస్ట్రేలియాకు నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో కంగారూలు సెమీస్ కు వెళ్లారు. ఇక నేటితో గ్రూప్-2 లో సెమీస్ రేసులో నిలచిదేవరో తేలనుంది. 

టీమిండియా ఆశలు.. 

గ్రూప్-2లో సెమీఫైనల్స్ రేసులో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, ఇండియా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో అఫ్గాన్ జట్టు విజయం సాధిస్తే.. కివీస్ ప్రస్థానం ముగిసినట్టే. భారత్ సెమీస్ రేసులోకి వస్తుంది. కానీ అఫ్గాన్.. న్యూజిలాండ్ ను ఓడించినా ఆ జట్టు సెమీస్ చేరాలంటే అది.. రేపు భారత్-నమీబియా మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. కాగా.. నెట్ రన్ రేట్ విషయంలో అఫ్గానిస్థాన్ (1.481), న్యూజిలాండ్ (1.277) కంటే ఇండియా (1.619) మెరుగైన స్థితిలో ఉంది. నేటి మ్యాచ్ లో అప్గాన్ అద్భుతం చేస్తే  అది భారత్ కే లాభం. నమీబియా పై భారీ విజయం సాధించడం  టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒకవేళ అఫ్గాన్ తో మ్యాచ్ ను  కివీస్ గెలిస్తే.. దానికి ఈ సమీకరణాలతో పనిలేకుండా సెమీస్ కు వెళ్తుంది. 

కష్టమే... కానీ 

ప్రస్తుతం న్యూజిలాండ్  ఫామ్ ను చూస్తే అఫ్గాన్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ టీ20 లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణాల్లో ఫలితం మారిపోయే ఈ  పొట్టి ఫార్మాట్ లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా ఏ పరంగా చూసినా అఫ్గాన్ పై కివీస్ దే పైచేయి. మార్టిన్ గప్తిల్, మిచెల్, కేన్ విలియమ్సన్, నీషమ్, కాన్వే, ఫిలిప్స్ వంటి దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్ ను నిలువరించడం అఫ్గాన్ బౌలర్లకు సవాలే.  ఇక బౌలింగ్ లోనూ ఆ విలియమ్సన్ సేనకు తిరుగులేదు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, మెల్నె, ఇష్ సోథి, మిచెల్ సాంట్నర్ లను తట్టుకుని క్రీజులో నిలబడటం కూడా అఫ్గాన్ బ్యాటర్లకు పరీక్షే. అఫ్గానిస్థాన్  పై మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేది కూడా కివీస్ బౌలర్లే కానున్నారు. 

ఇక  ఈ టోర్నీలో రాణిస్తున్న అఫ్గాన్ బ్యాటర్లు.. నేటి మ్యాచ్ లో ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరం. సౌధీ నేతృత్వంలోని బౌలింగ్ దళాన్ని ఎదుర్కుని ఆ బ్యాటర్లు నిలదొక్కుకోగలిగితే.. ఆ జట్టు సగం విజయం సాధించినట్టే. స్పిన్ ఆడటంలో ఇబ్బందులు ఎదుర్కునే కివీస్ బ్యాటర్లు.. రషీద్ ఖాన్, మహ్మద్ నబీని ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తికరం. అయితే అఫ్గాన్ తురుపుముక్క గా ఉన్న ముజీబ్ రెహ్మాన్ ఈ మ్యాచ్ లో ఆడకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే. దీంతో ఆ జట్టు ఆశలన్నీ రషీద్ పైనే ఉన్నాయి. 

అంతర్జాతీయ టీ20 లలో ఈ రెండు జట్లు తొలిసారి ఆడనున్నాయి.  ఇంతకుముందు న్యూజిలాండ్ బ్యాటర్లు.. ఐపీఎల్ లో రషీద్ ఖాన్ ను ఎదుర్కున్న అనుభవం ఉన్నా అబుదాబిలో అతడే కీలకం కానున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే భారత క్రికెట్ అభిమానుల ఆశలు కూడా అతడిపైనే ఉన్నాయి.

 

 

ఇక ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో  మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్ గెలవాలని కోరుకుంటున్న టీమిండియా తో పాటు భారత అభిమానులు కూడా మీమ్స్ తో అదరగొడుతున్నారు. రషీద్ ఖాన్ ను, అఫ్గాన్ ను భారత క్రికెటర్లు బుజ్జగిస్తున్నట్టు వచ్చిన మీమ్స్.. నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

జట్ల అంచనా.. 

అఫ్గానిస్థాన్ :  మహ్మద్ నబీ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, అహ్మద్ షెహజాద్, గుల్బాదిన్, నవీనుల్ హక్, రషీద్ ఖాన్, హమీద్ హసన్, రెహ్మతుల్లా గుర్బాజ్, నజీబుల్లా జర్దాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, షాహిది, ఫరీద్ అహ్మద్, ఉస్మాన్ గని

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్,  డెరిల్ మిచెల్, కాన్వే, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఆడమ్ మెల్నె, కైల్ జెమీసన్

Follow Us:
Download App:
  • android
  • ios