Asianet News TeluguAsianet News Telugu

T20 World cup 2021: అతడొక విఫల కెప్టెన్.. నాయకత్వ లక్షణాల్లేవు.. విరాట్ పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

danish Kaneria comments on Virat kohli: భారత సారథి కోహ్లి పై ఇప్పటికే పలువురు సీనియర్లు విమర్శలు సంధించగా.. తాజాగా పాక్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా కూడా కోహ్లిని టార్గెట్ చేశాడు. అతడొక విఫల కెప్టెన్ అంటూ  వ్యాఖ్యానించాడు.

ICC T20 world cup 2021: Former pakistan bowler danish kaneria comments on Team India skipper Virat, says kohli is unsuccessful captain
Author
Hyderabad, First Published Nov 2, 2021, 10:08 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడాక విమర్శకులు విరాట్ కోహ్లి (Virat Kohli)ని టార్గెట్ గా చేసుకున్నారు. ఆటగాడిగా విరాట్ కు ఎంత కీర్తి ఉన్నా.. నాయకుడిగా మాత్రం అతడొక విఫల నాయకుడు అని కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా పరిమితి ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోనున్న కోహ్లి..  అంతకంటే ముందే టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా అపకీర్తిని మూటగట్టుకుని వెళ్తున్నాడు. 

భారత సారథి పై ఇప్పటికే పలువురు సీనియర్లు విమర్శలు సంధించగా.. తాజాగా పాక్ (Pakistan) మాజీ బౌలర్ డానిష్ కనేరియా  (Danish kaneria)కూడా కోహ్లిని టార్గెట్ చేశాడు. అతడొక విఫల కెప్టెన్ అంటూ  వ్యాఖ్యానించాడు. అసలు కోహ్లిలో నాయకత్వ లక్షణాలే లేవని.. దూకుడుగా ఉంటాడేమో గానీ  సరైన నిర్ణయాలు తీసుకునేంత సమర్థుడు కాదని అన్నాడు. 

ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ.. ‘టీమిండియా ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది విరాట్ కోహ్లి. అతడొక విజయవంతం కాని నాయకుడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అతడి టీమ్ సెలక్షన్ అధ్వాన్నం. ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు కూడా విరాట్ సారథ్యంలోని టీమిండియా తొలి టెస్టులో దారుణంగా ఓడింది.  ఆ తర్వాత అజింక్యా రహానే సారథ్యంలో జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. విరాట్  చాలా గొప్ప ఆటగాడు అనడంలో సందేహమే లేదు. కానీ అతడిలో నాయకత్వ లక్షణాలు మాత్రం లేవు. దూకుడుగా ఉంటాడేమో గానీ మ్యాచ్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సమర్థమైన నాయకుడు మాత్రం కాడు’ అని అన్నాడు. 

అంతేగాక రవి శాస్త్రి పైనా కనేరియా కామెంట్స్ చేశాడు. ‘మరో కారణం రవిశాస్త్రి. అసలు కొంతకాలంగా ఆయన (రవిశాస్త్రి) కనిపించడంలేదు. తన టైం అయిపోయిందనే భావనలో ఉన్నాడో ఏమో. ఏదైతే అది అయింది. నాకేం సంబంధం లేదు అని వ్యవరిస్తున్నట్టుగా ఉంది. ఇక నేను ఎంఎస్ ధోనిని నిందించాలని అనుకోవడం లేదు. అతడు కొత్తగా జట్టుతో కలిశాడు. కానీ ఓటమికి మాత్రం అందరూ బాధ్యులే.. ఎందుకంటే ఇది ఒక్కరి ఆట కాదు.  అందరూ కలిసికట్టుగా ఆడేది’ అని చెప్పాడు.

ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మను మూడో స్థానంలో బ్యాటింగ్ కు దింపడంపై కూడా కనేరియా విమర్శలు కురిపించాడు. ‘అసలు విరాట్ ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఐపీఎల్ సమయంలో.. తాను, కెఎల్ రాహుల్ కలిసి టీ20 ప్రపంచకప్ లో ఓపెనింగ్ చేస్తానని వ్యాఖ్యానించాడు. తర్వాతనేమో రోహిత్ శర్మ, రాహుల్ అన్నారు. కానీ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో మాత్రం  ఏమాత్రం అనుభవం లేని ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపారు. ఈ వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది’ అంటూ కామెంట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios