Asianet News TeluguAsianet News Telugu

ఇండియాతో సిరీస్ కు కాన్వే స్థానంలో ఆ ఆటగాడిని ఎంపిక చేసిన న్యూజిలాండ్.. టీమిండియాకు మళ్లీ కష్టాలు తప్పవా..?

New Zealand Tour Of India: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు ముందు.. సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయపడటంతో అతడు భారత పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో న్యూజిలాండ్ జట్టు మరో విధ్వంసకర  ఆటగాడిని ఎంపిక చేసింది. 

ICC T20 World Cup 2021: Daryl mitchell to replace devon conway in New Zealand for Test Series Against India
Author
Hyderabad, First Published Nov 14, 2021, 3:26 PM IST

టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టే ప్రదర్శనతో ఫైనల్స్ కు చేరిన కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్.. నేడు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనున్నది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే  ఆ జట్టు భారత పర్యటనకు రానున్నది. ఈ టూర్ లో ఆ జట్టు.. మూడు టీ20 లు, రెండు టెస్టులు ఆడనున్నది. టీ20లు నవంబర్ 17 నుంచి మొదలవుతుండగా.. టెస్టులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు ముందు.. సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయపడటంతో అతడు భారత పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో న్యూజిలాండ్ జట్టు మరో విధ్వంసకర  ఆటగాడిని ఎంపిక చేసింది.  

గాయపడిన కాన్వే స్థానాన్ని టెస్టులలో డరిల్ మిచెల్  భర్తీ చేయనున్నాడు. మిచెల్.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో 47 బంతుల్లోనే 71 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ లో తొలిసారి న్యూజిలాండ్ ఫైనల్స్ కు వెళ్లేలా చేయడంలో అతడి పాత్ర కీలకం.  ఆ మ్యాచ్ లో కాన్వే తో కలిసి న్యూజిలాండ్ ను ఆదుకున్న మిచెల్.. ఆఖర్లో నీషమ్ సాయంతో కివీస్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లోనే కాన్వే గాయపడ్డాడు.  టీమిండియా టూర్ కు టెస్టు జట్టులో స్థానాన్ని  సంపాదించుకున్న కాన్వే  స్థానాన్ని ఇప్పుడు మిచెల్ భర్తీ చేయనున్నాడు. 

ఇదీ చదవండి : T20 World Cup: ఈ సెమీస్ హీరోలు ఒకప్పుడు జాన్ జిగ్రీ దోస్తులు.. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థులు..

మిచెల్ ఎంపికపై కివీస్ కోచ్ స్టెడ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ టెస్టు ఛాంపియన్ లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ లో కాన్వే సేవలను కోల్పోవడం నిజంగా బాధాకరం. కానీ ఇది మరొకరికి అవకాశాన్ని అందిస్తుంది. ఇక మిచెల్ అన్ని ఫార్మాట్లలోనూ భాగా రాణించగల సమర్థుడు. ఏ స్థానంలో  అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. టెస్టు జట్టులో స్థానం పొందినందుకు మిచెల్ సంతోషించి ఉంటాడు. అతడు భారత్ తో సిరీస్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడని నాకు తెలుసు..’ అని అన్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న మిచెల్ (197)  భారత్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక కావడం టీమిండియాకు సవాలే. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల సమర్థుడైన మిచెల్.. ఫీల్డింగ్ విన్యాసాలతోనూ మెరుస్తున్నాడు. ఈ ప్రపంచకప్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో కూడా మిచెల్.. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరి రాబోయే టెస్టు సిరీస్ లో భారత స్పిన్నర్లను ఎదుర్కుని మిచెల్ రాణించగలుగుతాడా..? లేదా..? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఇక ఇండియా-న్యూజిలాండ్ మధ్య  నవంబర్ 25-29 వరకు తొలి టెస్టు జరుగనుండగా.. డిసెంబర్ 3-7 దాకా రెండో టెస్టు జరగాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios