Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మ్యాచ్ కూడా గెలిచినట్టేనా..? కేన్ మామకు సవాలే..

Australia Vs New Zealand: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ జరిగిన గత 12 మ్యాచుల్లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన జట్టే 11 సార్లు విజయం సాధించింది. కేన్ మామకు ఇది సవాలే..

ICC T20 World Cup 2021: Australia Won The Toss and elected Field First against New Zealand In Final battle
Author
Hyderabad, First Published Nov 14, 2021, 7:11 PM IST

సుమారు 25 రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్  ఆఖరి అంకానికి చేరింది. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు దుబాయ్ లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. దుబాయ్ లోని వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్  నేతృత్వంలోని కంగారూ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని  కివీస్  జట్టు బ్యాటింగ్ కు దిగనున్నది. అయితే దుబాయ్ పిచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని.. అది గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే అని విశ్లేషణలు వినిపిస్తున్న వేళ.. కివీస్ వాటిని నిజం చేస్తుందా..? లేక కొత్త చరిత్ర లిఖించబోతుందా అనేది ఆసక్తికరం.

ఈ టీ20 ప్రపంచకప్ లో దుబాయ్ వేదికగా జరిగిన అన్ని మ్యాచుల్లో ఛేజింగ్ కు దిగిన జట్లే గెలిచాయి.  ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ జరిగిన గత 12 మ్యాచుల్లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన జట్టే 11 సార్లు విజయం సాధించింది. అంతేగాక దుబాయ్ లో  జరిగిన గత 17 టీ20లలో 16 సార్లు  ఛేదనకు దిగిన జట్లదే  విజయం. ఒకరకంగా చెప్పాలంటే  టాస్ గెలిస్తే  మ్యాచ్ గెలిచినట్టే లెక్క. ఇటీవలే ముగిసిన పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ సహా మొత్తం 44 మ్యాచులు జరుగగా.. 29  సార్లు టాస్ గెలిచిన జట్లే విజయం సాధించడం గమనార్హం. విజయాల శాతం 65.9 శాతంగా ఉంది. రికార్డులు ఇలా ఉంటే.. టాస్ ఓడిన కివీస్ ఏ మేరకు విజయం సాధిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ పోరులో ఆస్ట్రేలియా మార్పులేమీ చేయలేదు. కానీ న్యూజిలాండ్ మాత్రం గాయపడిన కీపర్ డెవాన్ కాన్వే స్థానంలో  మరో వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ను తుది జట్టులోకి తీసుకుంది.  కీలక ఫైనల్లో కాన్వే లేకపోవడం కివీస్ కు భారీ లోటే. 

ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర లిఖించడం ఖాయం.  ఆస్ట్రేలియా ఇదివరకు ఒకసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినా కప్పు మాత్రం చేజిక్కించుకోలేదు. ఆ జట్టుకు ఓవరాల్ గా ఇది తొమ్మిదో ఐసీసీ ఫైనల్. అందులో ఐదు సార్లు విజయం  సాధించడం గమనార్హం. కానీ న్యూజిలాండ్ కు  ఇదే తొలి టీ20 ఫైనల్. కానీ వన్డే ప్రపంచకప్ (2015, 2019) తో కలిపితే మూడోది. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ (ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను మినహాయిస్తే..) నెగ్గలేదు. అయినా ట్రోఫీ కోసం ఆ జట్టు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతుండటం గమనార్హం.  ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్ల మధ్య విజేత  ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  

బ్యాటింగ్, బౌలింగ్ లో రెండు జట్లు సమానంగా ఉన్నాయి.  రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లున్నారు. ఒంటి చేత్తో  మ్యాచ్ ను మలుపు తిప్పే ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. అయితే  తుది పోరులో ఎవరెలా రాణిస్తారనేది కొద్ది సేపట్లో తేలనుంది.

ఇరు జట్లు ఇప్పటివరకు 14 టీ20లలో తలపడగా ఆసీస్ దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ 5 మ్యాచుల్లో గెలవగా.. ఆసీస్ 9 విజయాలతో ఆధిక్యంలో ఉంది. ఇక టీ 20 ప్రపంచకప్ లో రెండు జట్లు ఒకసారి (2016లో) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ దే విజయం. కానీ గత వన్డే ప్రపంచకప్ (2015)లో ఆసీస్ చేతిలో కివీస్ కు భంగపాటు తప్పలేదు.


జట్లు.. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, స్మిత్, స్టాయినిస్, వేడ్, కమిన్స్, ఆడమ్ జంపా, హెజిల్వుడ్, స్టార్క్ 

న్యూజిలాండ్ : గప్తిల్, మిచెల్, విలియమ్సన్ (కెప్టెన్), ఫిలిప్స్, నీషమ్, సీఫర్ట్,  శాంట్నర్, మిల్నె, సౌథీ, సోధి,  బౌల్ట్

Follow Us:
Download App:
  • android
  • ios